Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్'ను వరిమళ్లలోకి దింపేసిన పొలం పాట!

By:  Tupaki Desk   |   28 March 2021 3:30 AM GMT
టక్ జగదీష్ను వరిమళ్లలోకి దింపేసిన పొలం పాట!
X
మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఒకసారి తనకి హిట్ ఇచ్చిన దర్శకులకు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇచ్చే అలవాటు నానీకి ఉంది. అలా ఇంతకుముందు తనకి 'నిన్నుకోరి' సినిమాతో హిట్ ఇచ్చిన శివ నిర్వాణతో తాజాగా 'టక్ జగదీష్' సినిమా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో ఎమోషన్ ను .. యాక్షన్ ను కలుపుకుంటూ సాగే ఈ సినిమాను, ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన ఈ సినిమా 'పరిచయ వేడుక' ఈవెంట్ లో, ఒక లిరికల్ వీడియో సాంగును ఎంపీ భరత్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు.

"నీటి నీటి సుక్కా .. నీలాల సుక్కా, నిలబాడి కురవాలి నీరెండయేలా .. " అంటూ ఈ పాట మొదలవుతోంది. వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే, పూటుగా పండితే పుటమేసి సేను .. పెదకాపు ఇచ్చేను సరిపుట్ల వడ్లు .." అంటూ ముందుకు సాగుతుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు నాట్లు వేస్తుంటారు .. ఆ సమయంలో కష్టం తెలియకుండా ఉండటం కోసం వాళ్లు పాటలు పాడుతూ ఉంటారు. వానలు బాగా కురవాలి .. పంటలు బాగా పండాలి .. అలా జరిగితే కూలీగా పెద్దకాపు ఎక్కువ వడ్లు కొలుస్తాడు అనే అర్థంలో ఈ పాట జానపద సొగసులతో నాజూగ్గా నడిచింది.

''నీరెండలో వాన కురిసినప్పుడు, గడ్డిపోచలపై పడిన వాన చినుకులు నీలాల మాదిరిగా మెరుస్తూ మెత్తగా జారుతుంటాయి అనే భావన బాగుంది. మాగాణి దున్నేటి మొనగాడు ఎవరే .. గరిగోళ్ల పిలగాడే ఘనమైనవాడే .. '' అనే పాటలోని పాదాలు, ప్రశ్న - సమాధానం రూపంలో ఆవిష్కరించబడ్డాయి. అంతేకాకుండా రంగంలోకి హీరో దిగుతుండగా పరిచయం చేసే పంక్తులుగా ఇవి కనిపిస్తాయి. 'ఎగదన్ని నిలుసున్న నిలువెత్తు కంకి.. ' అంటూ బాగా పండినందుకు గర్వంతో కంకి వెన్ను విరుచుకుని నిలబడిందనే ఉద్దేశంతో చేసిన పదప్రయోగం ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం .. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం .. మోహన భోగరాజు ఆలాపన ఈ పాటకి పల్లకీ కట్టాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.