Begin typing your search above and press return to search.

'టక్' సాంగ్: సింగర్ అవతారమెత్తిన డైరెక్టర్ శివ నిర్వాణ..!

By:  Tupaki Desk   |   3 Sep 2021 7:07 AM GMT
టక్ సాంగ్: సింగర్ అవతారమెత్తిన డైరెక్టర్ శివ నిర్వాణ..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన తాజా చిత్రం ''టక్ జగదీష్''. నాని - శివ నిర్వాణల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - సాంగ్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని 'టక్' పాటని మేకర్స్ రిలీజ్ చేశారు.

'టక్ జగదీష్' చిత్రంలోని ఈ టక్ సాంగ్ కు గోపి సుందర్ బాణీలు సమకూర్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దర్శకుడు శివ నిర్వాణ ఈ పాటకు సాహిత్యం అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. 'సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు.. నువ్ గిల్లి రెచ్చగొడితే వచ్చి దంచుతాడు.. నాజూకు నవ్వులోన జారుకత్తి పదును సూడు..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. శక్తివంతమైన శివ నిర్వాణ వాయిస్ ఈ జోనర్ సాంగ్ కు బాగా సూట్ అయింది. ఈ పాటలో నాని ని మాస్ అండ్ యాక్షన్ అవతారంలో చూపించారు.

కాగా, 'టక్ జగదీష్' చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన ఆరోగ్యకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ పెడుతున్నారు. 'వి' తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతున్న నాని రెండో సినిమా ఇది.

'టక్ జగదీష్' చిత్రంలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు - నాజర్ - రావు రమేష్ - నరేష్ - డేనియల్ బాలాజీ - తిరువీర్ - రోహిణి - దేవదర్శిని - ప్రవీణ్ ఇతర పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ థమన్ - గోపి సుందర్ ఈ చిత్రాననికి సంగీతం సమకూర్చారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. నాని నటిస్తున్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో సాహు గారపాటి - హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.