Begin typing your search above and press return to search.

తెలుగు తెరపై మెగా మిస్సైల్ .. చరణ్ : బర్త్ డే స్పెషల్

By:  Tupaki Desk   |   26 March 2021 5:53 PM GMT
తెలుగు తెరపై మెగా మిస్సైల్ .. చరణ్ : బర్త్ డే స్పెషల్
X
తెలుగులోనే కాదు ఏ భాషలోని చిత్రపరిశ్రమలోనైనా వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమనేది చాలా కాలం నుంచి ఉంది. అలా మెగాస్టార్ వారసుడిగా చరణ్ తెలుగు తెరకి పరిచయమయ్యాడు. స్టార్స్ వారసులకు ఎంట్రీ చాలా సులభం కనుక, వాళ్లు అనుకున్నదే ఆలస్యంగా హీరో కావొచ్చునని అంతా అనుకుంటూ ఉంటారు. వాళ్ల ఆలోచన నిజమే .. కాకపోతే ఎంట్రీ వరకే వారసత్వం పనికొస్తుంది .. పనిచేస్తుంది. ఆ తరువాత హీరోగా నిలదొక్కుకోవడమనేది వాళ్లకి గల సత్తాపైనే ఆధారపడి ఉంటుంది. అందుకు కారణం అభిమానుల్లో ఉండే అంచనాలు.

తెలుగు తెరపై చిరంజీవి ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. ఆయన వారసుడిగా చరణ్ ఎంట్రీ అనగానే ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. అప్పుడు ఆయన వాటిని అందుకోవడానికి ఇతర హీరోలకంటే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఆ కష్టంలో నుంచి కావలసిన ఫలితాన్ని రాబట్టిన మెగాధీరుడు చరణ్. తండ్రికి తగిన తనయుడు అనిపించుకోవడానికి మొదటి సినిమా నుంచే ఆయన కష్టపడటం మొదలుపెట్టాడు. 'చిరుత' సినిమా చూసిన ఏ ఒక్కరికీ మెగా వారసుడి యాక్టింగ్ విషయంలో చిన్న సందేహం కూడా కలగకపోవడమే అందుకు నిదర్శనం.

యూత్ మనసులు దోచేస్తూ, 'చిరుత' సినిమాతో మొదలైన చరణ్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ సాగుతోంది. మొదట్లో చిరంజీవిని అనుకరిస్తున్నట్టుగా అనిపించినా, ఆ తరువాత తనదైన స్టైల్ ను ఆవిష్కరిస్తూ ముందుకువెళ్లాడు. రెండవ సినిమా అయిన 'మగధీర'తోనే కొత్త రికార్డులకు సరికొత్త అర్థం చెప్పిన ఘనత చరణ్ సొంతం. 'రచ్చ' సినిమాతో మాస్ ఆడియన్స్ కి చేరువైన చరణ్, ఆ తరువాత 'గోవిందుడు అందరివాడేలే' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ పై కూడా పట్టు సంపాదించుకున్నాడు.

'ధ్రువ' .. 'రంగస్థలం' సినిమాలు చూస్తే, వైవిధ్యానికి చరణ్ ఎంతటి ప్రాధాన్యతను ఇస్తాడనే విషయం అర్థమవుతుంది. 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్ర .. నటనలో చరణ్ సాధించిన పరిణతికి అద్దం పడుతుంది. సినిమా .. సినిమాకి ఆయన లుక్ పరంగా కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరిస్తూ వస్తుండటం విశేషం. అప్పుడప్పుడు అభిమానులను అలరించడం కోసం తండ్రితో కలిసి తెరపై సందడి చేస్తున్నాడు. త్వరలో రానున్న 'ఆచార్య'లోను అభిమానులకు పండగ చేయనున్నాడు. హీరోగా మెగా మిస్సైల్ లా దూసుకుపోతున్న చరణ్, నిర్మాతగా కూడా చురుకైన పాత్రను పోషిస్తున్నాడు. మెగాస్టార్ స్థాయికి తగిన ప్రాజెక్టులను వరుసగా చేపడుతున్నాడు.

ఇక 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి చరణ్ చేస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ఇది. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ కి ఆకాశమే హద్దు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. డాన్స్ .. ఫైట్స్ .. ఇలా ఏ విషయంలోను ఎవరూ తనని వంకబెట్టడానికి వీలులేనంతగా చరణ్ తనని తాను మలచుకున్నాడు. అన్నివర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. నటనలోనే కాదు .. వ్యక్తిత్వం విషయంలోను తండ్రికి తగిన వారసుడు అనిపించుకున్నాడు. ఈ రోజున బర్త్ డే వేడుక జరుపుకుంటున్న మెగా వారసుడికి శుభాకాంక్షలు అందజేస్తూ, మున్ముందు ఆయన మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!