Begin typing your search above and press return to search.

ప్రముఖ నటిని మోసం చేసిన ఇద్దరు వ్యాపారవేత్తలు..కేసు నమోదు?

By:  Tupaki Desk   |   19 Nov 2021 4:52 AM GMT
ప్రముఖ నటిని మోసం చేసిన ఇద్దరు వ్యాపారవేత్తలు..కేసు నమోదు?
X
ప్రముఖ నటి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరున్న స్నేహ.. ఎప్పుడూ లేని రీతిలో కొత్త తరహా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వైనం బయటకు వచ్చింది. చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన ఆమె.. తనను ఇద్దరు వ్యాపారవేత్తలు మోసం చేసినట్లుగా ఆరోపించినట్లుగా చెబుతున్నారు. తనను నమ్మించి మోసం చేశారంటూ ఇద్దరు వ్యాపారవేత్తల మీద ఫిర్యాదు చేసి.. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం చూస్తే.. చెన్నైలోని ఒక ఎక్స్ పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు.. తమ బిజినెస్ కోసం డబ్బు అప్పుగా తీసుకున్నారు. వారికి వడ్డీ కింద రూ.26 లక్షలు ఇచ్చినట్లుగా ఆమె పోలీసులకు తెలిపారు. తనకు వడ్డీనే కాదు అసలు ఇవ్వట్లేదని.. తనను మోసం చేశారన్నారు.

తాను ఇచ్చిన డబ్బుల్ని అడిగితే వారు తనను బెదిరిస్తున్నట్లుగా ఆమె ఆరోపించారు.తాను అప్పుగా ఇచ్చిన రూ.26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నోచెబుతున్నారని.. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. ఇదిలా ఉంటే స్నేహ నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఎప్పుడూ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లని స్నేహ.. తాజాగా మోసపోయానంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించటం ఆసక్తికరంగా మారింది.