Begin typing your search above and press return to search.

ఇరవై ఏళ్లనాటి సంచలనం.. 'ఇంద్ర'

By:  Tupaki Desk   |   25 July 2022 10:57 AM GMT
ఇరవై ఏళ్లనాటి సంచలనం.. ఇంద్ర
X
చిరంజీవి కథానాయకుడిగా నటించిన సినిమాలలో 'ఇంద్ర'కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. లుక్ పరంగా .. నటన పరంగా మెగాస్టార్ ను మరింత పై స్థాయిలో చూపించిన సినిమా ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. 2002 జులై 24వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అంటే నిన్నటితో ఈ సినిమా 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. కానీ ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు మరిచిపోకపోవడం విశేషం.

ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే చిన్నికృష్ణ సమకూర్చితే, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. చిరంజీవి సరసన నాయికలుగా సోనాలీ బింద్రే .. ఆర్తి అగర్వాల్ నటించగా, ప్రకాశ్ రాజ్ .. ముఖేశ్ రుషి .. బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో బి. గోపాల్ 'సమర సింహారెడ్డి' .. 'నరసింహా నాయుడు' సినిమాలు చేశారు. 'ఇంద్ర' కూడా ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడుకున్నదే అయినా ఈ సినిమా నడకవేరు .. దీని ట్రీట్మెంట్ వేరు. ఆ సినిమాలతో ఈ సినిమాకి ఎక్కడ ఎలాంటి పోలిక కనిపించదు .. అనిపించదు.

కథ మొదలైన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చిక్కబడుతూ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠను పెంచుతూ వెళుతుంది. అందువలన ప్రేక్షకులు కథలో నుంచి బయటికి రాకుండా ఆ పాత్రలను అనుసరిస్తూ వెళుతుంటారు.

బలమైన కథాకథనాలు .. పవర్ఫుల్ డైలాగులు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అనే చిరంజీవి డైలాగ్ ను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. 'నా కూతురు కాశీలో ఉందనుకున్నాను .. విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలిసింది' అనే ఎమోషనల్ డైలాగ్స్ మనసుకు పట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ఈ సినిమాను ఆయన మ్యూజికల్ హిట్ గా నిలబెట్టారు. 'దాయిదాయి దామ్మా' పాటలో చిరంజీవి 'వీణ స్టెప్' ను ఇప్పటికీ చాలామంది ఆయా స్టేజ్ ల పై పెర్ఫార్మ్ చేస్తూనే ఉంటారు. కొరియోగ్రఫీ పరంగా లారెన్స్ కి మంచి మార్కులు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఇక కామెడీ పరంగా బ్రహ్మానందం అండ్ టీమ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. 120 సెంటర్స్ లో 100 రోజులను పూర్తిచేసుకున్న ఈ సినిమా మెగాస్టార్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయినే.