Begin typing your search above and press return to search.

ఒకే వేదిక‌పై ఇద్ద‌రు లెజెండ్స్

By:  Tupaki Desk   |   3 Feb 2019 9:28 AM GMT
ఒకే వేదిక‌పై ఇద్ద‌రు లెజెండ్స్
X
ఈ ప్ర‌పంచంలో శూన్యం నుంచి సంగీత ధ్వ‌నుల్ని వినే మ‌హానుభావులైన సంగీత ద‌ర్శ‌కులు ఎంత మంది ఉన్నారు? క‌నీసం భార‌త‌దేశంలో, సౌత్ ఫిలింఇండ‌స్ట్రీల్లో అలాంటి మ‌హానుభావుల జాబితాను వెతికితే అందులో టాప్ 1, 2 స్థానాల్లో ఓ రెండు పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాల్సిందే. ఆ రెండు పేర్లలో ఒక‌టి ఇళ‌య‌రాజా, రెండోది ఏ.ఆర్.రెహ‌మాన్. ద‌శాబ్ధాల పాటు సుస్వ‌రాల సృష్టిలో త‌ల‌మునక‌లుగా ఉన్న అలుపెర‌గ‌ని యోధులు ఈ ఇద్ద‌రూ. 75 లోనూ ఇళ‌య‌రాజా యువ‌కుడిలా సంగీత ధ్వ‌నుల్ని సృజిస్తూనే ఉన్నారు. ఏ.ఆర్.రెహ‌మాన్ ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై త‌న స‌త్తా చాటుతున్నారు.

ఆ ఇద్ద‌రూ ఒకే వేదిక‌పైకి వ‌స్తే ఎంత బావుంటుందో ఇదిగో ఈ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇద్ద‌రు లెజెండ్స్ ని వీక్షించేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. అంత క‌న్నుల‌పండువ‌గా ఉందా స‌న్నివేశం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గొప్ప ప‌ర్స‌నాలిటీస్ ఈ ఇద్ద‌రూ. సంగీత సాధ‌న‌తో నిత్య య‌వ్వ‌నులుగా విరాజిల్లుతున్నారు. ఆయ‌న త‌ర్వాత ఈయ‌న అంత‌కుమించి అని నిరూపించిన శిష్యుడు రెహ‌మాన్ ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ అందుకోవ‌డం ఓ చ‌రిత్ర‌.

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా 75 వ‌సంతాలు పూర్తి చేసుకున్న వేళ చెన్న‌య్ వీఎంసీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన లైవ్ కాన్సెర్టులో ఒకే వేదిక‌పై ఏ.ఆర్‌.రెహ‌మాన్ పెద్దాయ‌న‌తో క‌లిసి ఆల‌పించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని త‌మిళ నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ ద‌గ్గ‌రుండి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చే మొత్తాన్ని నిర్మాత‌ల సంఘం బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించ‌నున్నామ‌ని ఇదివ‌ర‌కూ విశాల్ తెలిపారు.