Begin typing your search above and press return to search.

మెగా 'గని' కోసం రెండు రిలీజ్ డేట్స్

By:  Tupaki Desk   |   1 Feb 2022 6:55 AM GMT
మెగా గని కోసం రెండు రిలీజ్ డేట్స్
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ (బాబీ) - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ కోసం రెండు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు.

పాండమిక్ పరిస్థితుల్లో టాలీవుడ్ లో రెండు విడుదల తేదీలను ప్రకటించడం సాధారణంగా మారిపోయింది. RRR బాటలో 'భీమ్లా నాయక్' సినిమాకు రెండు రిలీజ్ డేట్స్ ని ఖరారు చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు మెగా 'గని' చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. జాగ్రత్తగా చర్చించి ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే 'గని' సినిమా రిలీజ్ ఇతర సినిమాల విడుదల షెడ్యూల్‌ పై ఆధారపడి ఉంటుందని.. తాము అన్ని చిత్రాలకు ఆరోగ్యకరమైన విడుదలను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలో మీ అందరినీ థియేటర్లలో కలుస్తామని తెలుపుతూ ఓ ప్రకటన వదిలారు. నిజానికి ఈ చిత్తాన్ని డిసెంబర్ 24న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సినిమాల మధ్య క్లాష్ ఇండస్ట్రీకి మంచిది కాదని భావించి.. 2022 మార్చి 18కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించారు.

ఇప్పుడు పెద్ద సినిమాల విడుదలలు రీ షెడ్యూల్ చేస్తున్న నేపథ్యంలో మరోసారి కొత్త డేట్స్ ఇచ్చారు. ఒకవేళ 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25వ తేదీన వస్తే 'గని' చిత్రాన్ని మార్చి 4న ప్రేక్షకుల తీసుకొచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, 'గని' చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నదియా - నరేష్ - తనికెళ్ళ భరణి - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.