Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. కూక‌ట్ ప‌ల్లిలో ఆ రెండు థియేట‌ర్లు క‌నుమ‌రుగు?

By:  Tupaki Desk   |   11 Sep 2021 10:30 AM GMT
#గుస‌గుస‌.. కూక‌ట్ ప‌ల్లిలో ఆ రెండు థియేట‌ర్లు క‌నుమ‌రుగు?
X
హైద‌రాబాద్-సికింద్రాబాద్ జంట‌న‌గ‌రాల్లో కూక‌ట్ ప‌ల్లి ర‌ద్దీనే వేరు. ఈ ఏరియా ఆంధ్రా వ‌ల‌స‌దారుల నిల‌యం. ఇక ఇదే ప్రాంతంలో భ్ర‌మ‌రాంభ‌-మ‌ల్లిఖార్జున్ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు అంతే కిట‌కిట‌లాడుతుంటాయి. ఈ థియేట‌ర్ల‌కు కొన్ని ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉంది. ఈ రెండూ కూక‌ట్ ప‌ల్లి ఏరియాలో మాస్ కి ఆక‌ర్ష‌ణీయ‌మైన థియేట‌ర్లుగా పాపుల‌ర‌య్యాయి. ముఖ్యంగా శ‌ని ఆదివారాల్లో ఈ రెండు థియేట‌ర్లు ఎప్పుడూ కిక్కిరిసిపోతాయి. స్టార్ హీరోల చిత్రాలేవైనా ఆ ప్రాంతంలో ఈ రెండు థియేట‌ర్ల‌లో ప్ర‌ధానంగా విడుద‌ల‌వుతుంటాయి.

స‌రిగ్గా కూక‌ట్ ప‌ల్లి ప్రైమ్ ఏరియాలో థియేట‌ర్లు ఉండ‌టంతో ఎలాంటి సినిమా రిలీజ్ అయినా థియేట‌ర్లు హౌస్ ఫుల్స్ తో న‌డుస్తాయి. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు కావ‌డం.. టిక్కెట్ ధ‌ర మ‌ల్టీప్లెక్సుల‌తో పొల్చితే త‌క్కువకే అందుబాటులో ఉండ‌డంతో ఈ రెండు థియేట‌ర్లు స్టూడెంట్స్ తో ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఆ ర‌కంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆ రెండు థియేట‌ర్ల‌తో మంచి అనుబంధం ఉంది. అయితే ఇక ఇవి క‌నుమ‌రుగ‌య్యే టైమ్ వ‌చ్చిందంటూ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. భ్ర‌మ‌రాంభ‌-మ‌ల్లిఖార్జున్ కాంప్లెక్స్ ని కూల్చేసి అదే స్థలంలో హై రైజ్ అపార్ట్ మెంట్ ని నిర్మించేందుకు అనుమ‌తులు కోసం యాజ‌మాన్యం ధ‌ర‌ఖాస్తు చేసింద‌ని గాసిప్స్ వైర‌ల్ అవుతున్నాయి. అనుమ‌తులు రాగానే కూల్చివేత ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని తెలుస్తోంది. స‌రిగ్గా మెయిన్ రోడ్డుని ఆనుకుని ఉండ‌టంతో ట్రాఫిక్ ఆంక్ష‌లు కూడా పెరిగాయి. దీంతో మేనేజ్ మెంట్ కి ఆ రకంగాను ప్ర‌భుత్వంతో ఇబ్బంది త‌ప్ప‌క‌పోవ‌డ‌మే కూల్చివేత‌కు కార‌ణం అంటూ ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో కాంప్లెక్స్ మొత్తం కూల్చేసి కొత్త‌గా ట్రాపిక్ కి అంత‌రాయం లేకుండా కొత్త నిర్మాణం చేసి లాంచ్ చేయాల‌ని చూస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇప్ప‌టికే ట్విన్ సిటీస్ లో చాలా వ‌ర‌కూ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌ను పంక్ష‌న్ హాల్స్ గా మార్చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా రాక‌తో ఆ స‌న్నివేశం మ‌రింత ఊపందుకుంది. మ‌రిన్ని థియేట‌ర్లు మూత‌ప‌డుతున్నాయి. చ‌రిత్ర‌లో సినిమాకు సేవ‌లు చేసిన థియేట‌ర్లు మాయ‌మ‌వ్వ‌డం బాధాక‌రం. తాజాగా రాజ‌ధాని జంట న‌గ‌రాల్లో రెండు పేరున్న థియేట‌ర్లు మూత ప‌డ‌తాయ‌న్న ప్ర‌చారం నిజం కాకూడ‌ద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది రియ‌ల్ ఫేక్ న్యూస్ అయినా అవ్వొచ్చు అంటూ కొంద‌రు అభిమానులు అంటున్నారు. ఇవి ప‌ర్ఫెక్ట్ కండీష‌న్ లో ఉండే మోడ్ర‌నైజ్డ్ థియేట‌ర్లు .. ఇవి క‌నుమ‌రుగ‌వుతున్నాయ‌న్న‌ది న‌మ్మ‌లేమ‌ని అంటున్నారు.