Begin typing your search above and press return to search.

ఉదయ్‌కిరణ్‌ సినిమాను ఆపుతోందెవ్వరు?

By:  Tupaki Desk   |   26 Jun 2015 4:00 AM IST
ఉదయ్‌కిరణ్‌ సినిమాను ఆపుతోందెవ్వరు?
X
అప్పుడే ఏడాదిన్నర అయిపోతోంది ఉదయ్‌ కిరణ్‌ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయి. అవకాశాలు లేకపోవడం వల్ల మనో వేదనకు గురవడం వల్లే ఆ యువ కథానాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కూడా తేల్చేశారు. నెమ్మదిగా అందరి జ్ఞాపకాల్లోంచి వెళ్లిపోతున్నాడు ఉదయ్‌. ఐతే ఉదయ్‌ చివరగా నటించిన 'చిత్రం చెప్పిన కథ' సినిమాను విడుదల చేయడానికి అతను బతికి ఉన్నప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ సినిమా విడుదల కావడం లేదు. జూన్‌ 26న అతడి పుట్టిన రోజు.

పోయేనేడాదే ఉదయ్‌ పుట్టిన రోజుకు 'చిత్రం చెప్పిన కథ'ను విడుదల చేద్దామనుకున్నారు. అప్పట్లో విడుదలైన ట్రైలర్‌ కూడా జనాల్ని బాగానే ఆకట్టుకుంది. కానీ తెర వెనుక ఏం జరుగుతోందో ఏమో కానీ.. సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. ఐతే ఈ పుట్టినరోజుకైనా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెద్దామనుకున్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ సినిమాకు ఏవో లీగల్‌ చిక్కులొచ్చాయి. సినిమా విడుదల ఆపాలంటూ ఎవరో పిటిషన్‌ వేస్తే.. కోర్టు విడుదలపై స్టే ఇచ్చింది. మరి ఈ సినిమాను ఎవరు ఆపుతున్నారన్నది తెలియడం లేదు. ఉదయ్‌ మేనేజర్‌ మున్నానే ఈ సినిమాకు నిర్మాత. మోహన్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిక్కులన్నీ తప్పించుకుని త్వరగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.