Begin typing your search above and press return to search.

'బాలీవుడ్ ను అపఖ్యాతి పాలు చేసినా.. తరలించాలని చూసినా ఉపేక్షించేది లేదు'

By:  Tupaki Desk   |   16 Oct 2020 4:30 PM GMT
బాలీవుడ్ ను అపఖ్యాతి పాలు చేసినా.. తరలించాలని చూసినా ఉపేక్షించేది లేదు
X
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోని నెపోటిజం(బంధుప్రీతి).. డ్రగ్స్ వ్యవహారం.. లైంగిక వేధింపులు వంటి అనేక అంశాలపై మీడియా సోషల్ మీడియాలలో కథనాలు వచ్చాయి. అలానే వీటిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా బహిరంగ విమర్శలు చేశారు. అయితే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే బాలీవుడ్ చిత్ర పరిశ్రమను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. సుశాంత్‌ మరణం తర్వాత పలువురు హిందీ చిత్రసీమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో థాక్రే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే మల్టీప్లెక్స్‌ మరియు థియేటర్‌ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''హిందీ సినీ ఇండస్ట్రీని అపఖ్యాతి పాలు చేయాలని గానీ.. మరో చోటుకు తరలించాలని గానీ ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేదు. ముంబై దేశానికి ఆర్థిక రాజధాని మాత్రమే కాదు.. వినోదాన్ని పంచే రాజధాని కూడా. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్‌ వినోదాన్ని అందిస్తోంది. ఎంతో మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. ఈ మధ్య చిత్ర పరిశ్రమ పేరును దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎంతో బాధించాయి. చిత్ర పరిశ్రమ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుంది. కరోనా నేపథ్యంలో గత ఆరు నెలలుగా మూసివేసిన థియేటర్లను రీ ఓపెన్ చేయడానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ విధానాల్ని తయారు చేస్తోంది. ఇది పూర్తయ్యాక థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటాం'' అని అన్నారు.