Begin typing your search above and press return to search.

‘శాతకర్ణి’లో ఇద్దరు లెజెండ్స్ అదరగొట్టారు

By:  Tupaki Desk   |   28 Dec 2016 1:31 PM GMT
‘శాతకర్ణి’లో ఇద్దరు లెజెండ్స్ అదరగొట్టారు
X
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గొప్పదనం గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రపంచంలో ఏ గాయకుడికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 40 వేలకు పైగా పాటలు పాడి చరిత్ర సృష్టించారాయన. బాలుది కేవలం రాశి మాత్రమే కాదు.. వాసి కూడా అని ఆయన పాడిన ఏ పాట విన్నా అర్థమైపోతుంది. మూణ్నాలుగు దశాబ్దాల పాటు అలుపెరగకుండా పాటలు పాడిన ఈ దిగ్గజ గాయకుడు.. గత కొన్నేళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. తాను మాత్రమే పాడాల్సిన ప్రత్యేకమైన పాట ఏదైనా తన దగ్గరికి వస్తే తప్ప ఆయన పాడట్లేదు. అలాగే ఈ తరం సంగీత దర్శకులు కూడా ఆయనకు ప్రాధాన్యం తగ్గించేశారు.

ఇలాంటి తరుణంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి స్పెషల్ మూవీలో బాలు పాట పాడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. మృగనయనా.. అంటూ సాగే ఆ పాటను వింటే ఈ పాటను బాలుతోనే ఎందుకు పాడించారో అర్థమైపోతుంది. ఈ వయసులోనూ బాలు గాన మాధుర్యం ఏమాత్రం తగ్గలేదనిపిస్తుంది ఈ పాట పాడితే. యువ స్వర సంచలనం శ్రేయా ఘోషల్ తో కలిసి అద్భుతమైన రీతిలో ఈ పాటను ఆలపించారు బాలు. విశేషం ఏంటంటే.. కొన్నేళ్లుగా మరుగున ఉన్న మరో లెజెండరీ మేల్ సింగర్ కూడా ఈ సినిమాలో ఓ పాట పాడారు. ఆయన మరెవరో కాదు.. ఉదిత్ నారాయణ. ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ పాటలెన్నో పాడిన ఉదిత్.. కొన్నేళ్లుగా ఇటు తెలుగులో.. అటు హిందీలో పాటలు తగ్గించేశారు. ఆయన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం శ్రేయా ఘోషల్ తో కలిసి ‘ఏకి మేడా..’ అనే పాటను ఆలపించారు. ఆ పాట కూడా ఆల్బంలో ప్రత్యేకమైందే. మొత్తానికి ఇద్దరు దిగ్గజ గాయకులు ఒక ప్రెస్టీజియస్ మూవీలో పాటలు పాడి తమ అభిమానుల్ని అలరించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/