Begin typing your search above and press return to search.

విశ్వనటుడి సినిమాకు థియేటర్లు లేవేంటి..?

By:  Tupaki Desk   |   2 Jun 2022 7:35 AM GMT
విశ్వనటుడి సినిమాకు థియేటర్లు లేవేంటి..?
X
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్''. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు (జూన్ 3) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ తెలుగు హిందీ భాషల్లో సినిమాపై బజ్ ఏర్పడలేదు.

'విక్రమ్' సినిమాలో కమల్ హసన్ తో పాటుగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళ సహజ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. నిజానికి సినిమాపై బజ్ క్రియేట్ అవడానికి ఈ నలుగురు పాపులర్ స్టార్స్ పేర్లు సరిపోతాయి.

కానీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న 'విక్రమ్' సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో హిందీలో తక్కువ స్క్రీన్స్ కేటాయించారు. వాస్తవానికి కమల్ హిందీ ట్రైలర్ ను లాంచ్ చేసి, పాపులర్ కపిల్ శర్మ షో వంటి పలు ప్రోగ్రామ్స్ కు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశారు. ఇవేమీ ఈ చిత్రానికి పెద్దగా ఉపయోగపడినట్లు లేదు.

జూన్ 3న విడుదల కానున్న అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాపైనే హిందీ ప్రేక్షకుల దృష్టి అంతా ఉంది. అదే రోజు విడుదలయ్యే 'మేజర్' చిత్రంతో అడివి శేష్ హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. ప్రమోషన్స్ మరియు ప్రివ్యూలతో ఈ చిత్రంపై ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు.

ఈ నేపథ్యంలో ఎక్కువ భాగం థియేటర్లు 'మేజర్' మరియు 'పృథ్వీరాజ్' సినిమాలకు ఇవ్వబడ్డాయి. దీంతో తమిళ డబ్బింగ్ సినిమా 'విక్రమ్' కు చాలా తక్కువ స్క్రీన్లు దొరికాయి. ఇతర చిత్రాలతో పోల్చితే కమల్ సినిమాకు ఆశించిన స్క్రీన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా డల్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు తెలుగులో కూడా 'విక్రమ్' పరిస్థితి అలానే ఉంది. మినిమమ్ ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో జనాలు ఈ సినిమాపై ఫోకస్ పెట్టలేదని అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి అర్థం అవుతుంది. అందులోనూ 'మేజర్' సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో.. కమల్ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందో చూడాలి.

'విక్రమ్' చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యువ హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ - ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చారు.