Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ రవి.. మరోసారి డైరెక్షన్?

By:  Tupaki Desk   |   20 Jan 2023 4:30 PM GMT
అన్ స్టాపబుల్ రవి.. మరోసారి డైరెక్షన్?
X
టాలీవుడ్ లో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బీవీఎస్ రవి. రచయితగా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న బీవీఎస్ రవి అప్పుడప్పుడు నటుడిగా కనిపిస్తూ చిన్న చిన్న పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా బీవీఎస్ రవి నటించాడు. ఇక రచయితగా చాలా సినిమాలు చేశాడు. ఖండం సినిమా తర్వాత రచయితగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా బీవీఎస్ రవి దూసుకుపోయాడు. మాటల కొన్ని సినిమాలకి మాటల రచయితగా, కొన్ని సినిమాలకి కథా రచయితగా బీవీఎస్ రవి పని చేశాడు.

చివరిగా నాగ చైతన్య హీరోగా వచ్చిన థాంక్యూ సినిమాకి కథ అందించాడు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న రానా, వెంకటేష్ వెబ్ సిరీస్ రానా నాయుడుకి రచయితగా పని చేస్తున్నాడు. మరో వైపు బాలకృష్ణ ఆహలో చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి కాన్సెప్ట్ రైటర్ గా బీవీఎస్ రవి ఉన్నాడు. దీనికి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ఇలా రచయితగా సక్సెస్ అయిన బీవీఎస్ రవి దర్శకుడిగా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. 2011లో గోపీచంద్ తో వాంటెడ్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. రొటీన్ స్టొరీ అనే ముద్ర ఈ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం అయ్యింది.

ఇక 2017లో సాయిధరమ్ తేజ్ తో జవాన్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఎవరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. కథ కొత్తగా ఉన్న కథనం విషయంలో తడబడ్డాడు అనే టాక్ జవాన్ కి వినిపించింది. అయితే మూడో సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో బీవీఎస్ రవి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటరెస్టింగ్ స్టొరీ లైన్ రెడీ చేసుకున్నారు. కళ్యాణ్ రామ్, లేదంటే రామ్ లో ఒకరితో ఈ మూవీ చేయాలని భావిస్తున్నాడు.

వీరి డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. వారికి ఇప్పటికే కథని చెప్పడం జరిగిందని తెలుస్తుంది. అయితే ఇద్దరిలో ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారితో మూవీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మూడో సినిమా కోసం ప్రొడ్యూసర్ ని కూడా బీవీఎస్ రవి ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి వీరిలో ఎవరు ఈ రైటర్ కమ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారనేది వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.