Begin typing your search above and press return to search.

ఆయ‌న‌ను నంబ‌ర్- 1ని చేయ‌నిదే స్టార్ వైఫ్ నిద్ర‌పోర‌ట‌!

By:  Tupaki Desk   |   23 Sep 2021 4:37 AM GMT
ఆయ‌న‌ను నంబ‌ర్- 1ని చేయ‌నిదే స్టార్ వైఫ్ నిద్ర‌పోర‌ట‌!
X
ఆలు మ‌గ‌ల క‌లుపుగోలుత‌నం క‌లివిడిత‌నం ఆ ఇంటికి గొప్ప కాంతుల్ని ప‌రుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాపారం ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని కోణాల్లోనూ మేలు జ‌రుగుతుంది. కొంద‌రు ఇల్లాళ్లు అయితే భ‌ర్త‌కు చేదోడువాదోడుగా నిలుస్తూ.. స్వయంగా వ్యాపార సామ్రాజ్యాల్నే విస్త‌రిస్తున్నారు. కింగ్ ఖాన్ షారూక్.. అజ‌య్ దేవ‌గ‌న్.. ధ‌నుష్.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌- మ‌హేష్ .. వీళ్లంద‌రి జీవిత భాగ‌స్వాములు వారి ఎదుగుద‌ల‌లో ఒక భాగం. అర్థ‌నారిగా భార్యామ‌ణులు చేసిన సేవ‌ల ఫ‌లితం వంద‌ల వేల కోట్ల సామ్రాజ్య విస్త‌ర‌ణ దిశ‌గా ఉప‌క‌రించిందంటే అతిశ‌యోక్తి కానే కాదు.

ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ జీవిత భాగ‌స్వామి న‌మ్ర‌త ప్లానింగ్ గురించి వ్యాపార ద‌క్ష‌త గురించి ఎన్నో క‌థ‌నాలొచ్చాయి. మ‌హేష్ అంత పెద్ద స్టార్ గా ఎద‌గ‌డం వెన‌క న‌మ్ర‌త ప్ర‌ణాళిక‌లు నిబ‌ద్ధ‌త గొప్ప‌గా ప‌ని చేశాయ‌ని ఇండ‌స్ట్రీలో టాక్ ఉంది. మ‌హేష్ పెద్ద స్టార్ హీరోగానే కాదు క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆర్జించ‌డం వెన‌క న‌మ్ర‌త పీఆర్ ప్లానింగ్ ఉప‌క‌రించిందని చెబుతారు. ఇక ఏఎంబీ సినిమాస్ వెన‌క న‌మ్ర‌త మంత్రాంగం గురించి బోలెడంత చ‌ర్చ సాగింది. ఇప్పుడు అదే ఆట‌లో ఉపాసన కొణిదెల బిగ్ గేమ్ ప్లాన‌ర్ గా ఉన్నార‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ విమాన‌యానంలో ప్ర‌వేశించ‌డానికి ఉపాస‌న ప్రోద్బ‌లం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ సెట్ అవ్వ‌డం వెన‌క ఉపాస‌న మంత్రాంగం న‌డిచింద‌ట‌.

రామ్ చరణ్ ని నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌బెట్టేందుకు ఇప్పుడు స‌తీమ‌ణి ఉపాస‌న గ‌ట్టి పంతంతో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకే శంక‌ర్ సినిమా కోసం అన్నీ తానే అయ్యి స‌హ‌క‌రిస్తున్నార‌ట‌. శంక‌ర్ సినిమా అంటే అసాధార‌ణ‌ బ‌డ్జెట్ల‌తో సావాసం.. పైగా భారీ కాన్వాసుతో సినిమా కోసం వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రం విజువల్ వండ‌ర్ గా నిల‌వాలంటే.. సజావుగా సినిమాని పూర్తి చేయ‌డం కోసం ఉపాసన తన వంతు కొన్ని బాధ్యతలు తీసుకున్నార‌ట‌.

శంకర్ సినిమాలు భారీ స్థాయిలో విజువ‌ల్ రిచ్ లొకేష‌న్ల‌తో తెర‌కెక్కుతాయి. మేక‌ప్ లు కాస్ట్యూమ్స్ సెట్లు వ‌గైరా వ‌గైరా అన్నీ భారీ ఖ‌ర్చులు త‌ప్ప‌దు. అవ‌స‌రం మేర‌ ఖ‌ర్చులు పెరుగుతాయి. అయితే వాటి నిర్వ‌హ‌ణలో ను.. చ‌ర‌ణ్‌ విషయాలలో సహాయం చేస్తానని ఉపాస‌న ఆర్సీ15 టీమ్ కి హామీ ఇచ్చార‌ట‌. ఇక లాంచింగ్ వేడుక‌కు ర‌ణ‌వీర్ కియ‌రా లాంటి స్టార్లు విచ్చేశారు. నాయ‌కానాయిక‌లు స‌హా ఫోటోషూట్ల కోసం కోటికి పైగా ఖర్చ‌యింద‌ని ప్ర‌తిదీ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా నిర్వ‌హించేందుకు చెర్రీ త‌ర‌పున ఉపాస‌న అవ‌స‌ర‌మ‌య్యే జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

భార‌త‌దేశంలో ఒక విజువ‌ల్ గ్రాండియ‌ర్ సినిమా కోసం ఒక స్టార్ హీరోకి త‌న భార్యామ‌ణి ఇంత‌గా స‌హాయం చేయ‌డం చాలా అవ‌స‌రం. ప్రాజెక్ట్ స‌వ్యంగా పూర్త‌వ్వ‌డానికి ఇది చాలా ముఖ్యం. అందుకే ఉపాస‌న త‌ర‌పు నుంచి చరణ్ కి అన్నివిధాలా స‌హ‌కారం అందుతోంది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల న‌డుమ పాన్ ఇండియా వార్ న‌డుస్తోంది. ఈ వార్ లో ఒక్కో రోజు ఒక్కో పావు ముందుకు క‌దుపుతూ తెలివిగా ఆటాడాలి. నిచ్చెన‌లు ఎక్కాలి. అలా జ‌ర‌గాలంటే భార్యామ‌ణుల తెలివైన గేమ్ ప్లానింగ్ చాలా అవ‌స‌రం. అందుకే ఇప్పుడు భార్యల రంగ ప్ర‌వేశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఉపాస‌న కూడా ఆయ‌న‌ను నంబ‌ర్ వ‌న్ ని చేయ‌డ‌మే ధ్యేయంగా శ్ర‌మిస్తున్నార‌ని దీనిని బ‌ట్టి భావించ‌వ‌చ్చు.