Begin typing your search above and press return to search.

ఉపాసన ఆగ్రహంలో ధర్మం ఉంది

By:  Tupaki Desk   |   11 April 2019 10:53 AM GMT
ఉపాసన ఆగ్రహంలో ధర్మం ఉంది
X
ఓటు వేయటం కోసం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఓటు మాయమైతే ఎంతలా మండుతుంది? అందులోకి.. పది రోజుల క్రితం ఓటర్ల జాబితాలో చెక్ చేసుకుంటే ఉన్న ఓటు.. పోలింగ్ రోజుకు లేదని తెలిస్తే ఆ ఆవేశం ఎంతలా ఉంటుందో.. తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.

అపోలో ఆసుపత్రుల వైస్ ఛైర్ పర్సన్ శోభన కామినేని ఓటు గల్లంతైన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తన తల్లి ఓటు మాయంపై ఆమె కుమార్తె.. మెగాస్టార్ ఇంటి కోడలు ఉపాసన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లిన శోభనా ఓటు వేయటం కోసం హైదరాబాద్ కు వచ్చారు. ఓటర్ల జాబితాలో ఆమె పేరు మిస్ కావటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఉపాసన సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. పది రోజుల క్రితం తన తల్లి ఓటర్ల జాబితాలో పేరు చెక్ చేసుకున్నప్పుడు పేరు ఉందని.. ఇప్పుడు మాత్రం మిస్ అయినట్లు పేర్కొన్నారు. అమ్మ కూడా పన్ను కడుతోంది.. అలాంటప్పుడు ఆమె లెక్కలోకి రాదా? భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా? అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక.. శోభనా కామినేని స్పందిస్తూ.. తన జీవితంలో ఇది వరస్ట్ డే అని పేర్కొన్నారు. తాను భారత్ వచ్చిందే తన బాధ్యతను నిర్వర్తించుకోవటానికని.. తీరా పోలింగ్ బూత్ కు రాగానే తన ఓటు గల్లంతైందని చెబుతున్నారని మండిపడ్డారు. నాకీ దేశంలో విలువ లేదా? నా ఓటు ముఖ్యం కాదా? ఓ పౌరురాలిగా తనకు జరిగిన నేరంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను దీన్ని సహించలేనని చెప్పారు. కాగా అపోలో హాస్పిటల్స్‌ అధినేత ప్రతాప్‌ రెడ్డి కుమార్తె.. చేవెళ్ల లోక్‌ సభ స్ధానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డికి శోభనా కామినేని సమీప బంధువు.