Begin typing your search above and press return to search.

అనీ మాస్టర్ కొరియోగ్రఫీతో ఉపాసన సోదరి సంగీత్!

By:  Tupaki Desk   |   7 Dec 2021 6:31 AM GMT
అనీ మాస్టర్ కొరియోగ్రఫీతో ఉపాసన సోదరి సంగీత్!
X
అనీ మాస్టర్ .. ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. 'బిగ్ బాస్' సీజన్ 5 ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేసిన సందడిని వాళ్లు మరిచిపోలేదు.

తన ఆత్మాభిమానాన్ని కాపాడుకునే విషయంలో ఆమె ఎంతమాత్రం వెనక్కి తగ్గకపోవడాన్ని ప్రేక్షకులు గమనించారు. ఆమె ఆత్మీయత .. ఆవేశం ఎలా ఉంటాయనేది చూశారు. తన అభిప్రాయాన్ని ఆమె నిర్మొహమాటంగా చెప్పే తీరు .. అవతలవారి అభిప్రాయం సరైనది కాకపోతే దానిని నిష్కర్షగా ఖండించే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది.

అలా బిగ్ బాస్ హౌస్ ద్వారా తానేమిటనేది నిరూపించుకున్న అనీ మాస్టర్ కి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' తోనే ఆమెకి తొలిసారిగా అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా అవకాశం దక్కింది. ఆ తరువాత పవన్ కల్యాణ్ గుడుంబా శంకర్' .. రామ్ చరణ్ 'రచ్చ' సినిమాలకు పనిచేసింది.

అందువలన చరణ్ కి ఆమె టాలెంట్ పై మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం కారణంగానే ఆమె చేతికి ఒక ఈవెంట్ వచ్చింది. రీసెంట్ గా ఉపాసన సోదరి 'అనుష్పాల' సంగీత్ కార్యక్రమం జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న అనుష్పాల ఆయనను వివాహం చేసుకుంటోంది.

ఉపాసన పూర్వీకులకు చెందిన 'దోమకొండ'లో ఆదివారం రోజున సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొరియోగ్రఫీ బాధ్యతను అనీ మాస్టర్ కి చరణ్ అప్పగించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనీ మాస్టర్ కూడా అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత అనీ మాస్టర్ కి లభించిన ఒక మంచి ఆఫర్ ఇది. ఇక మహేశ్ బాబు కూతురు సితారకి కూడా ఆమె డాన్స్ నేర్పుతోందట.

కెరియర్ పరంగా అనీ మాస్టర్ చాలా కష్టాలు పడ్డారు. ఆర్ధిక పరమైన ఇబ్బందుల కారణంగానే ఆమె చదువు ఆపేసి, తనకి ఇష్టమైన డాన్స్ ను వృత్తిగా ఎంచుకున్నారు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.

అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా చాలామంది డాన్స్ మాస్టర్స్ దగ్గర పనిచేశారు. ఆ తరువాత కొరియోగ్రఫర్ గా ఆమె మొదటి ఛాన్స్ ను 'జ్యోతిలక్ష్మి' సినిమాతో పూరి జగన్నాథ్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రతిభ .. ఆత్మవిశ్వాసం కలిస్తే అనీ మాస్టర్ అనే పేరు తెచ్చుకున్నారు.