Begin typing your search above and press return to search.

యశోదకు కలిసొచ్చే అంశాలివే..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 1:30 PM GMT
యశోదకు కలిసొచ్చే అంశాలివే..!
X
టాలీవుడ్ లో పలువురు హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్నారు. హీరోల స్థాయిలోనే మార్కెట్ ని పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు కూడా ఒకరు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద 35 కోట్లకు పైగానే వసూలు చేసింది. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ''యశోద'' అనే సినిమాతో వస్తోంది.

హరి & హరీష్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్ లో తెరకెక్కిన చిత్రం ''యశోద''. ఉన్ని ముకుందన్ - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో నవంబర్ 11న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ థ్రిల్లర్ మూవీ ఏ మేరకు జనాలను థియేటర్లకు రప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కొన్ని రోజుల క్రితం, సమంతా తాను మైయోసిటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రత్యక్షంగా ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో మేకర్స్ సైతం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వంటివి ఏమీ నిర్వహించలేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సామ్ తన సినిమాకి ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో సినిమా కోసం సమంత ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో 'యశోద' మూవీ విశేషాలతో పాటుగా ఆమె తన ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుత మానసిక స్థితి గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా సామ్ భావోద్వేగానికి గురవ్వడం చూసిన ఆడియన్స్ నటి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ఒక్క ఇంటర్వ్యూ జనాలను థియేటర్లకు నడిపిస్తుందా అనేది ప్రశ్నార్థంగా మారింది.

సరోగసీ నేపథ్యంలో 'యశోద' సినిమా తెరకెక్కింది. ఇందులో ఆ పాయింట్ తో పాటుగా మరికొన్ని థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. ప్రమోషనల్ కంటెంట్ లో అది కనిపిస్తుంది. కాకపోతే ట్రైలర్ ఆశించిన స్పందన రాలేదు. ఒకాడికి తెలుగు కంటే హిందీ ట్రైలర్ కు ఎక్కువ వ్యూస్ వచ్చాయి. కాబట్టి తెలుగులో మరింత ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది.

'యశోద' చిత్రం సమంత పేరు మీదుగా మార్కెట్ చేయబడిన సినిమా. ఆమె ఆరోగ్యం బాగుంటే 'ఓ బేబీ' మాదిరిగానే ఆమె తన భుజాన వేసుకొని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరుకాలేని స్థితిలో ఉంది. దీంతో సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మిగతా వారి మీద పడింది. వరలక్ష్మీ - ఉన్ని కృష్ణన్ ఒకటీ అర ఇంటర్వ్యూలు ఇచ్చినా.. అవి సినిమాకు పెద్దగా బజ్ తీసుకురాలేదు.

దర్శకులు తెలుగులో తెలిసినవాళ్ళు కాకపోవడం మరో విషయం. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్శించేలా మేకర్స్ ప్రత్యేకమైన ప్రమోషనల్ స్ట్రాటజీలతో రావడం లేదు. కాకపోతే ఇప్పుడు సమంత ఇంటర్వ్యూ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగేలా చేసింది. అంతేకాదు ఈ వారం పోటీగా పేరున్న మరో మూవీ రిలీజ్ లేకపోవడం 'యశోద' కు కలిసొచ్చే అంశమని చెప్పాలి.

సమంత స్టార్‌ డమ్ 'యశోద' ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుంది. కంటెంట్ బాగుండి మంచి టాక్ వస్తే.. వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉంటుంది. 'జానూ' తర్వాత నేరుగా తెలుగులో చేసిన ఈ సినిమా.. సామ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.