Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' లో అందరి లుక్స్ మారబోతున్నాయా..?

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:31 AM GMT
ఆదిపురుష్ లో అందరి లుక్స్ మారబోతున్నాయా..?
X
2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "ఆది పురుష్'' సినిమా అనుకున్న సమయానికి రావడం లేదు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం టీమ్ కు మరికొంత సమయం అవసరం అవుతోందని చెబుతూ.. మరో ఐదు నెలలు ఈ చిత్రాన్ని వాయిదా వేసి, కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

దసరా సందర్భంగా విడుదల చేసిన "ఆది పురుష్'' టీజర్ పై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని.. గ్రాఫిక్స్ దారుణమని.. మోషన్ క్యాప్చర్ పిక్చర్ అని చెప్పి ఒక కార్టూన్ సినిమాని చూపిస్తున్నారని విమర్శలు చేశారు.

రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ 'ఆదిపురుష్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన రాముడు - సీత - రావణుడు - హనుమంతుడు పాత్రలను టీజర్ లో భిన్నంగా చూపించడంపై అభ్యంతరాలు వచ్చాయి. ప్రధాన పాత్రల లుక్స్ పై పలువురు రాజకీయ నాయకులు మరియు హిందుత్వవాదులు సీరియస్ అయ్యారు.

హిందువుల నమ్మకాలను మనోభావాలు దెబ్బ తీసేలా పాత్రల చిత్రణ ఉందని ఆరోపించారు. పరమశివ భక్తుడైన రావణుడి పాత్రను అల్లావుద్దీన్ ఖిల్జీ - ఔరంగజేబు గెటప్స్ ను పోలివుండేలా చూపించారని.. గుబురు గడ్డం - మిలిటరీ కటింగ్ - స్పైక్స్ తో నీలి కళ్ళతో లంకేశ్ ఒక టర్కిష్‌ నిరంకుశుడిలా కనిపించాడని విమర్శించారు.

రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ తో పాటుగా వానరులను బొమ్మలుగా చూపించడం.. ఆంజనేయుడు లెదర్ జాకెట్ ను పోలిన వస్త్రాన్ని ధరించడం వంటి విషయాలపైనా అభ్యంతాలు - ట్రోల్స్ వచ్చాయి. అభ్యంతరకర సీన్లను తీసేయాలని.. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని రాజకీయ నాయకులు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో సినీ అభిమానులు - సామాన్య ప్రజలు - విశ్లేషకులు మరియు ప్రముఖుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని 'ఆదిపురుష్' సినిమాలోని పాత్రల రూపాలను సవరించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందు కోసమే మరికొంత సమయం తీసుకున్నారని తెలుస్తొంది.

సినిమాలో రావణుడి పాత్రదారి గడ్డాన్ని డిజిటల్‌ గా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అంతేకాదు మిగతా పాత్రలను కూడా బెటర్ గా చూపించడానికి టీమ్ అంతా వర్క్ చేస్తోంది. అలానే ఎక్కువ శ్రద్ధ వహించి మెరుగైన వీఎఫ్ఎక్స్ చేయటానికి.. మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

''ఆదిపురుష్'' సినిమాలో శ్రీ రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్.. ప్రతినాయకుడు రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. బాలీవుడ్ సంస్థ టీ-సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ పౌరాణిక చిత్రాన్ని.. యూవీ క్రియేషన్స్ వారు తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

2023 జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 3డీ - ఐమాక్స్ ఫార్మాట్ లలో ''ఆదిపురుష్" చిత్రాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.