Begin typing your search above and press return to search.

ఎలా చూసినా 'ఇండియన్ 2' పెద్ద సినిమానే!

By:  Tupaki Desk   |   10 Sep 2022 9:53 AM GMT
ఎలా చూసినా ఇండియన్ 2 పెద్ద సినిమానే!
X
కమల్ హాసన్ కథానాయకుడిగా 1996లో వచ్చిన 'ఇండియన్' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. కమల్ కెరియర్లోనే కాదు .. శంకర్ కెరియర్ లోను చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రని పోషించింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అప్పటి నుంచి ట్రై చేస్తూనే వచ్చారు.

ఈ మధ్య కాలంలోనే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. కొంత షూటింగు జరిగిన తరువాత కొన్ని కారణాల వలన వాయిదాపడినప్పటికీ, మళ్లీ ఇటీవలే షూటింగ్ మొదలైంది.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను ఈ నెల 3వ వారం నుంచి మొదలుపెట్టనున్నారు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్టు, ఈ సినిమాకి రైటర్ గా పని చేస్తున్న జె. మోహన్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పారు. ఈ సినిమా నిడివి కూడా 3 గంటల 10 నిమిషాలు ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అన్నాడు. మరి కొంత కాలం ఆగితే ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెప్పాడు.

మొత్తానికి 'ఇండియన్ 2' బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగానే కాదు, నిడివి పరంగా కూడా పెద్దదని తెలుస్తూనే ఉంది. శంకర్ సినిమాల్లో బలమైన కథాకథనాలు ఉంటాయి .. పాత్రలను మలిచే విధానం విభిన్నంగా ఉంటుంది. తెరపై సన్నివేశాలను ఆవిష్కరించే తీరు భారీగా ఉంటుంది.

ఇక తన సినిమాల్లో పాటల విషయంలోను .. వాటి చిత్రీకరణ విషయంలోను శంకర్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. అందువల్లనే ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలుస్తూ ఉంటాయి. ఇండియన్ 2' విషయంలోను ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు.

లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా అలరించనుంది. రకుల్ .. ప్రియా భవాని శంకర్ .. బాబీ సింహా .. సిద్ధార్థ్ .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'విక్రమ్' సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ లో అనిరుధ్ ఉన్నాడు. అంతకు మించి అన్నట్టుగా ఆయన ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమా మరో సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.