Begin typing your search above and press return to search.

మెడ‌లో మంగ‌ళ‌సూత్రం ప‌డితేనే జ‌యం!

By:  Tupaki Desk   |   10 March 2023 8:00 PM GMT
మెడ‌లో మంగ‌ళ‌సూత్రం ప‌డితేనే జ‌యం!
X
ఆలు మ‌గ‌ల దాంప‌త్య క‌థ‌ల‌తో నాటి రోజుల్లో బోలెడ‌న్ని హిట్లు కొట్టారు. ఇలాంటి క‌థ‌ల‌తో తెర‌కెక్కే సినిమాల్లో సెంటిమెంట్ మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు ఎంతో క‌నెక్టింగ్ గా ఉంటుంది. ఓటీటీలు- వెబ్ సినిమాలు హోరెత్తుతున్న ఈ స్మార్ట్ యుగంలో మ‌హిళామ‌ణుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం అంటే అంత సులువేమీ కాదు. అలాగ‌ని ప‌విత్ర బందం- ఉండ‌మ్మా బొట్టు పెడ‌తా- మాంగ‌ళ్య బ‌లం- మంగ‌ళ సూత్రం అంటూ.. సినిమాలు తీసే రోజులు కావు ఇవి. నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో ప్ర‌తిదీ ట్రెండీగా ఉండాలి. అందులో కూడా సెంటిమెంటు పండాలి. అప్పుడే కుటుంబ స‌మేతంగా ఆడ‌వారితో క‌లిసి థియేట‌ర్ల‌కు వ‌చ్చే వీలుంటుంది. ముఖ్యంగా భార్యాభ‌ర్త‌ల సెంటిమెంట్ వ‌ర్క‌వుటైతే కాసుల వ‌ర్షం కురిపించ‌డం క‌ష్టం కానేకాద‌ని నేటి జ‌న‌రేష‌న్ సినిమా 'మ‌జిలీ' నిరూపించింది. నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట వెండితెర‌పైనా భార్యాభ‌ర్త‌లుగా అద్భుతంగా న‌టించారు. మోడ్రనైజ్డ్ ల‌వ్ స్టోరీతో పాటు భార్యాభ‌ర్త‌ల అనుబంధం నేప‌థ్యంలో అద్భుత‌మైన సెంటిమెంట్ ని రంగ‌రించి నేటిత‌రం ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతం.

అత‌డు ప్ర‌స్తుతం స‌మంత‌-దేవ‌ర‌కొండ జంట‌గా 'ఖుషి' అనే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ సినిమాకి కూడా మాంగ‌ళ్య బ‌లం ప్ర‌ధాన ఆయుధంగా మార‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. యాథృచ్ఛికంగా అయినా నాగ‌చైత‌న్య‌తో సమంత‌ బంధంలో ఉన్న క్ర‌మంలో తెర‌కెక్కించిన మ‌జిలీలో ప‌విత్ర‌మైన మంగ‌ళ‌సూత్రంతో క‌నిపించి పెద్ద విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు కూడా ఖుషి ద్వితీయార్థంలో మంగ‌ళ‌సూత్రం- ప‌సుపు కుంకుమ‌ల‌తో ముత్తైదువులా సామ్ క‌నిపిస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భార్యాభ‌ర్త‌ల న‌డుమ సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఖుషీలోని కీల‌క స‌న్నివేశాలు మ‌తులు చెడ‌గొడ‌తాయ‌ని కూడా లీకులు అందాయి. ఆస‌క్తిక‌రంగా 'మ‌నం' చిత్రంలోను స‌మంత మంగ‌ళ‌సూత్రంతో క‌నిపించింది. మ‌నం అక్కినేని కుటుంబానికి మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా నిలిచింది. ఈ సినిమా విజ‌యంలో త‌న పాత్ర‌ను ఏర‌కంగాను త‌క్కువ చేసి చూడ‌లేం. అలా వ‌రుస‌గా తాళి బొట్టుతో క‌నిపించి విజ‌యాలు అందుకోవాల‌న్న కుతూహ‌లం స‌మంత‌లో ఇప్ప‌టికీ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది.

అటు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోను స‌మంత కెరీర్ ని ప‌రిశీలిస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు మాంగ‌ళ్య బ‌లంతో సంబంధం ఉంది. తేరి- సూప‌ర్ డీల‌క్స్ లాంటి త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లోను స‌మంత మంగ‌ళ‌సూత్రంతో వివాహిత‌గా క‌నిపించింది. ఏ ర‌కంగా చూసినా తాళి బ‌లం (మంగ‌ళ‌సూత్ర బ‌లం) త‌న‌కు క‌లిసొచ్చింద‌ని విశ్లేషించాల్సి వ‌స్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఖుషిలో స‌మంత‌ ద్వితీయార్థంలో గృహిణిగా కనిపించబోతోంది. ఇది ఒక ఎపిక్ సీక్వెన్స్ అవుతుందని బాగా నచ్చుతుందని అంటున్నారు. మారుతున్న ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా స‌మంత ఎంపిక‌లు కూడా మారుతున్నాయి. త‌న ఆలోచ‌న‌లు మరింతగా సెంటిమెంట్ రంగును పులుముకోవ‌డం ఆస‌క్తిక‌రం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.