Begin typing your search above and press return to search.

LCU విశ్వంలో క‌మ‌ల్ హాస‌న్- సూర్య‌- విజ‌య్?

By:  Tupaki Desk   |   15 Oct 2022 6:43 AM GMT
LCU విశ్వంలో క‌మ‌ల్ హాస‌న్- సూర్య‌- విజ‌య్?
X
మార్వ‌ల్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ ని షార్ట్ క‌ట్ లో MCU అని పిలుస్తున్నారు. ఈ సంస్థ‌లో భారీ ఫ్రాంఛైజీ సినిమాలు బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా మార్వ‌ల్ తెర‌కెక్కించిన అవెంజ‌ర్స్ సిరీస్ వ‌సూళ్ల వ‌ర‌ద‌ను పారించింది.

MCUలో ఎవెంజర్స్ కంటే ముందు కెప్టెన్ అమెరికా- హల్క్-థోర్- స్పైడర్ మాన్ వంటి భారీ సినిమాలు వ‌చ్చి వంద‌ల‌ మిలియ‌న్ల డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టాయి. ఆయా సినిమాల్లోని పాత్ర‌ల‌న్నిటినీ క‌లిపి అవెంజ‌ర్స్ లో అద్భుతంగా చూపించారు. ఈ త‌ర‌హా ఫార్ములా కూడా ఆస‌క్తిని క‌లిగించింది. ఎంసియు విశ్వం గురించి దాని ఫాలోవ‌ర్స్ గురించి నిజానికి చెప్పాల్సిన ప‌నే లేదు.

ఇటీవ‌ల హాలీవుడ్ లో MCU త‌ర‌హాలోనే కోలీవుడ్ లో LCU అనే ప‌దం త‌ర‌చుగా వినిపిస్తోంది. అంటే ఇది కూడా హిట్ సినిమాల పాత్ర‌ల‌న్నిటినీ క‌లుపుతూ ఒక స‌రికొత్త విశ్వాన్ని సూచించే ప్ర‌య‌త్న‌మా? అని కొంద‌రు సందేహిస్తున్నారు. అస‌లు LCU అంటే ఏమిటీ? అంటే.. ''లోకేష్ క‌న‌గ‌రాజ్ యూనివ‌ర్శ్'' అని మీనింగ్.

యువ‌ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన వ‌రుస చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలుస్తూ అత‌డి క్రియేటివిటీకి గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. అగ్ర హీరోల‌తో రియ‌లిస్టిక్ ఎప్రోచ్ తో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నాడు. అత‌డు ఇప్ప‌టికే కార్తీతో ఖైదీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాడు. క‌మ‌ల్ హాస‌న్ - సేతుప‌తి- సూర్య‌ల‌ను క‌లిపి 'విక్ర‌మ్' లాంటి మ‌రో సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. త‌దుప‌రి ద‌ళ‌ప‌తి 67 కి కూడా అత‌డే ద‌ర్శ‌కుడు. ఈ సినిమా అయ్యాక స‌ద‌రు హీరోలంద‌రినీ క‌లుపుతూ ఎల్.సి.యులో భారీ సినిమాని తెర‌కెక్కించే ఆలోచ‌న‌తో ఉన్నాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు లోకేష్ క‌న‌గ‌రాజ్ కోసం ఇటు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్- మ‌హేష్ స‌హా ప‌లువురు హీరోలు ఇప్ప‌టికే లోకేష్ క‌న‌గ‌రాజ్ ని సంప్ర‌దించారు. మంచి క‌థ‌తో త‌మ‌ను క‌ల‌వాల్సిందిగా కోరారు. కానీ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఎల్.సి.యు పేరుతో ఒక భారీ విశ్వాన్ని క్రియేట్ చేసి అందులో సౌత్ హీరోలంద‌రినీ మెర్జ్ చేసి భారీ పాన్ ఇండియా సినిమాలు తీయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు చెన్నై వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బహుభాష‌ల స్టార్ల‌తో భారీ బ‌డ్జెట్ల‌తో పాన్ ఇండియా సినిమాల‌ను తీసి పాన్ వ‌ర‌ల్డ్ రేంజులో వ‌ర్క‌వుట్ చేయాల‌ని అత‌డి మైండ్ లో ఆలోచ‌న ఉంద‌ని తెలిసింది. ఇక సూర్య హీరోగా రోలెక్స్ పాత్ర‌తో ఒక సినిమా చేస్తాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

ఫిలింఫేర్ లో సూర్య లీకులు..

67వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌ లో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రంలో రోలెక్స్ పాత్రను పోషించడం తనకు ఇష్టం లేదని సూర్య వెల్లడించాడు. విక్రమ్‌ లో రోలెక్స్ పాత్రను తిరస్కరించాలని చిత్రనిర్మాత లోకేష్ కనగరాజ్‌ కు కాల్ చేయడానికి ఫోన్ తీసుకున్నాన‌ని సూర్య వెల్లడించారు. 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతల జాబితాను ప్రకటించ‌గా.. సూర్య నటించిన సూరరై పొట్రు (ఆకాశం నీ హ‌ద్దురా) తమిళ విభాగంలో అత్యధిక అవార్డులను గెలుచుకుంది. సూర్య ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నాడు. తన ప్రసంగంలో ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ లో తన ప్రత్యేక పాత్ర గురించి ప్రస్తావించాడు.

కమల్ హాసన్ నటించిన యాక్షన్ ఫీస్ట్ సౌత్ బాక్సాఫీస్‌లోనే కాకుండా విడుద‌లైన ప్ర‌తి చోటా బ్లాక్ బస్టర్ గా మారింది. ఈ చిత్రం పరిశ్రమలోని వ్యక్తుల నుండి కూడా భారీ ప్రశంసలను అందుకుంది. విజయ్ సేతుపతి - ఫహద్ ఫాసిల్ కూడా నటించిన ఈ చిత్రంలో సూర్య 'డ్రగ్ లార్డ్' రోలెక్స్ పాత్రలో కనిపించాడు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో దీని గురించి మాట్లాడుతూ మొదట దానిని తిరస్కరించాలని భావించానని చెప్పాడు.

విక్రమ్ చిత్రంలో రోలెక్స్ గురించి సూర్య మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే సౌత్ సూపర్ స్టార్ తాను ఒక వ్యక్తి కోసం మాత్రమే చేశానని అది కమల్ హాసన్ అని ఒప్పుకున్నాడు. ఫిలింఫేర్ అవార్డ్స్ వేదిక‌పై సూర్య మాట్లాడుతూ- ''నేను ఈ రోజు ఏం చేస్తున్నా.. జీవితంలో నేను ఏమి చేస్తున్నా కమల్ సార్ ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా ఉంటారు. అతను కాల్ చేసి అవకాశం ఉందని చెప్పినప్పుడు.. నేను దానిని వదులుకోదలచుకోలేదు. నేను దీన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భయపడినప్పుడల్లా దూకాలనుకుంటాం. ఇది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. నేను లోకేష్ కి ఫోన్ చేసి నేను చేయను అని చెప్పబోతున్నాను. కానీ నేను ఒక వ్యక్తి(క‌మ‌ల్ హాస‌న్) కోసం ఈ పాత్ర‌లో న‌టించాను. ఆ పాత్రకు ఇంత ప్రేమ ప్రశంసలు లభిస్తాయని ఊహించలేదు అని అన్నారు. ఈ చిత్రంలో ఈ అతిథి పాత్ర చూశాక‌.. సూర్య అభిమానులను రోలెక్స్ పై చిత్రం పైప్ లైన్ లో ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేసింది.

విక్రమ్ గురించి వివ‌రాల్లోకి వెళితే ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఇది LCU అకా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం. కార్తీ నటించిన కైతి (ఖైదీ) చిత్రంతో LCU ప్రారంభమైంది. తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం... LCU ప్రపంచంలో తదుపరి చిత్రంలో ద‌ళ‌పతి విజయ్ న‌టించ‌నున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.