Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొచ్చే సినిమా ఒక్కటైనా ఉందా..?

By:  Tupaki Desk   |   27 July 2022 2:30 AM GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొచ్చే సినిమా ఒక్కటైనా ఉందా..?
X
కరోనా పాండమిక్ నేపథ్యంలో రెండేళ్ల పాటు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న తెలుగు చిత్ర పరిశ్రమ.. ఇప్పుడు యధావిధిగా కార్యకలాపాలు జరుపుకుంటోంది. వాయిదా పడిన సినిమాలన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేశాయి. చూస్తుండగానే ఈ ఏడాదిలో అప్పుడే ఏడు నెలలు గడిచిపోయింది. వరుసగా సినిమాలైతే రిలీజ్ చేస్తున్నారు కానీ.. సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ వుండటం ఆందోళన కలిగించే విషయం.

జనవరిలో 'బంగార్రాజు' పర్వాలేదనిపించగా.. ఫిబ్రవరి నెలలో చిన్న సినిమాగా వచ్చిన 'డీజే టిల్లు' బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. మార్చిలో RRR సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏప్రిల్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టలేదు. మే నెలలో 'సర్కారు వారి పాట' విజయం సాధించగా.. 'ఎఫ్ 3' యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

జూన్ ప్రారంభంలో 'మేజర్' సినిమా ఘనవిజయం సాధించింది. జులైలో ఇప్పటి వరకు ఏ ఒక్క మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అంటే 2022 లో ఏడు నెలల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ను పరిశీలిస్తే మూడు నాలుగు సినిమాలు మాత్రమే థియేట్రికల్ లో లాభాలు తెచ్చిపెట్టాయి. మిగతావన్నీ ప్లాప్స్ గా నిలిచి నష్టాలు తెచ్చిపెట్టినవే ఉన్నాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీల మళ్ళీ పుంజుకుందని.. పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతోందని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ.. ఈ ఏడాది ఒక్క RRR మాత్రమే అద్భుతమైన విజయం సాధించింది. భారీ అంచనాలతో వచ్చిన మిగతా పాన్ ఇండియా సినిమాలు - క్రేజీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చూశాయి.

పాండమిక్ కి ముందు కూడా హిట్టు ప్లాప్స్ ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ ఇప్పుడున్న దాని కంటే కాస్త బెటర్ గానే ఉండేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోవడం వల్లనే టాలీవుడ్ బాక్సాఫీస్ కు కళ తప్పిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓటీటీల కారణంగా మెజారిటీ ఆడియన్స్ ఇంట్లోనే కూర్చిని సినిమాలు చూడటానికి ప్రాధాన్యత ఇవ్వడం.. అధిక టికెట్ రేట్లు వంటివి ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. అందుకే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం కలెక్షన్స్ అందుకోలేక పోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్లీ ఊపు రావాలంటే రాబోయే సినిమాల్లో కనీసం రెండు మూడు మంచి వసూళ్లు సాధించడం చాలా అవసరమని చెప్పాలి. ఈ శుక్రవారం 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా మొదలుకొని వచ్చే నెల చివరి వారం వరకూ 'బింబిసార' 'సీతారామం' 'కార్తికేయ 2' 'మాచర్ల నియోజకవర్గం' 'లైగర్' 'రంగరంగ వైభవంగా' వంటి చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

వచ్చే నెలలో అయినా టాలీవుడ్ నుంచి విజయవంతమైన సినిమాలు వస్తాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఆయా చిత్ర బృందాలు దూకుడుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ రేట్లు పెడుతున్నారు. మరి ఈ సినిమాల్లో ఏవేవి హిట్ అవుతాయో.. బాక్సాఫీస్ కు కళ తీసుకొస్తాయా లేదా అనేది వేచి చూడాలి.