Begin typing your search above and press return to search.

I- ROBOT ని మించేలా ప్ర‌భాస్ 'ప్రాజెక్ట్ K'

By:  Tupaki Desk   |   24 Oct 2022 5:44 AM GMT
I- ROBOT ని మించేలా ప్ర‌భాస్ ప్రాజెక్ట్ K
X
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో ప్రాజెక్ట్ కె అత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో టాలీవుడ్ స‌హా ఇండియ‌న్ సినీప‌రిశ్ర‌మ‌లోనే ఇది భారీ ప్ర‌యోగ‌మ‌ని అశ్విన్ -ద‌త్ బృందం చెబుతున్నారు. దీంతో ఒక‌టే క్యూరియాసిటీ నెల‌కొంది. ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్ర‌భాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే పోస్ట‌ర్ తో పాటే కొన్ని డౌట్లు స‌జీవంగా పుట్టుకొచ్చాయి.

సైన్స్‌ ఫిక్షన్ క‌థాంశంతో రూపొంద‌నున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ పాత్ర ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించ‌నుంది స‌రే... వీఎఫ్ ఎక్స్- గ్రాఫిక్స్ క్వాలిటీ ఎలా ఉండ‌నుంది? అన్న‌దే ఇప్పుడు అభిమానుల్లో ప్ర‌ధాన‌ ప్ర‌శ్న‌. బాహుబలిని మించి నేటిత‌రం అవెంజ‌ర్స్ త‌ర‌హాలో సూపర్‌ హీరోగా అత‌డిని ఇందులో చూపించే వీలుంది. దీపావ‌ళికి ముందే అభిమానుల‌కు కానుకిచ్చింది నాగ్ అశ్విన్ టీమ్. అయినా కానీ....! అంటూ కొన్ని డౌట్లు వ్య‌క్తం చేస్తున్నారు.

సూప‌ర్ మేన్ త‌ర‌హాలో రోబోటిక్‌ చేయి ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేయ‌గా అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ మూవీపై అభిమానులు స‌హా కామ‌న్ జ‌నాల్లో ర‌క‌ర‌కాల సందేహాలు రేకెత్తాయి. నిజానికి ప్ర‌యోగాలు చేసేప్పుడు ఇలాంటివి కామ‌న్ అనుకున్నా.. క్వాలిటీ వ‌ర్క్ తో మాత్ర‌మే ఇలాంటి వాటిని జ‌యించ‌గ‌లమ‌ని నాగ్ అశ్విన్ నిరూపించాల్సి ఉంటుంది. ఇంత‌కుముందు ఓంరౌత్ ఆదిపురుష్ గ్లింప్స్ రిలీజ్ చేసిన‌ప్పుడు వ‌చ్చిన విమ‌ర్శ‌లు ప్రాజెక్ట్ కే టీజ‌ర్ కి రాకూడ‌ద‌ని కోరుకుంటున్నారు.

అయితే బాహుబ‌లి- RRR- ఈగ‌ లాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన రాజ‌మౌళికి అలాంటి స‌మ‌స్య ఎప్పుడూ ఎదురు కాలేదు. నిజానికి అది అభిరుచి క్వాలిటీ వ‌ర్క్ కి సంబంధించిన మ్యాట‌ర్ అని రాజ‌మౌళి నిరూపించారు. ఇటీవ‌ల‌ విడుదలైన ఇతర హాలీవుడ్ చిత్రాలలో అల్ట్రా-రియలిస్టిక్ ఉత్కంఠభరితమైన విజువల్ ఎఫెక్ట్ లను చూసిన తర్వాత సినీ ప్రేమికులు నాసిరకం విజువ‌ల్స్ ని వీఎఫ్ ఎక్స్ - గ్రాఫిక్స్ ని చూసేందుకు ఆస‌క్తిగా లేరు. పైగా ఇలాంటి వాటిపై కామెడీలు చేస్తార‌ని చాలా సంద‌ర్భాల్లో రుజువైంది.

ఇంతకుముందు రుద్ర‌మ‌దేవి క్లైమాక్స్ క్వాలిటీ లేని వీఎఫ్ ఎక్స్ తో ఎలా తేలిపోయిందో తెలుసు. ఆ క్లైమాక్స్ బిగ్ కామెడీ. అయితే దానికి ఆర్థిక ఇబ్బందులు కార‌ణమ‌నేది నిర్మాత‌ల వ‌ర్ష‌న్. కానీ కావాల్సినంత బ్యాక‌ప్.. డ‌బ్బు ఉండి కూడా 'బ్రహ్మాస్త్ర' కోసం క‌ర‌ణ్ జోహార్ లాంటి నిర్మాత‌ నాణ్యత లేని VFX తో విసిగించార‌ని చాలా మంది విమ‌ర్శించారు.

ఆదిపురుష్ టీజర్ చూశాక ఓంరౌత్ ఇంత‌కుమించి ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాడు. చాలా సినిమాల‌కు క్వాలిటీ వ‌ర్క్ లేక‌పోవ‌డం లేదా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు అభిరుచి లేక‌పోవ‌డం అనేదే ఇక్క‌డ పెను స‌మ‌స్య‌. అందుకే దీనిని నాగ్ అశ్విన్- అశ్వ‌నిద‌త్ బృందం అధిగ‌మిస్తారా? లేదా? ప్రాజెక్ట్ K గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి? అన్న‌ది డిబేట‌బుల్ గా మారింది.

డార్లింగ్ పుట్టినరోజు పోస్టర్ లో రోబోటిక్ చేయి చూడ‌గానే ఇది కూడా భారీ వీఎఫ్ ఎక్స్ - గ్రాఫిక్స్ తో రూపొందించే సినిమా అని క్లారిటీ వ‌చ్చేసింది. హీరోలు రైజ్ అవుతారు అని చెప్ప‌గానే సూప‌ర్ హీరో సినిమా అని అంద‌రూ అంచ‌నాకి వ‌చ్చేశారు. అయితే ఇది క్రిష్ త‌ర‌హా సూప‌ర్ ఫ్రాంఛైజీ అవుతుందా లేదా? అన్నది క్వాలిటీ గ్రాఫిక్స్ నిర్ణ‌యిస్తాయి. హాలీవుడ్ లో ఐరోబోట్- ఎవెంజర్స్- కెప్టెన్ అమెరికా- బ్యాట్ మేన్ స‌హా అనేక సినిమాల‌ను త‌ల‌పించేలా పోస్ట‌ర్ వేశాక‌.. ఇక అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె కూడా సూపర్ హీరో రోబోటిక్ కాస్ట్యూమ్ లో కనిపించనుండ‌డం దీపిక కూడా యాక్ష‌న్ క్వీన్ ని త‌ల‌పించ‌డం ప్ర‌ధానంగా హైప్ ని పెంచే అంశం.

ప్రాజెక్ట్ Kలో VFX నాణ్య‌త‌తో పాటు చాలా వాస్తవికంగా ఉండాలి. ప్రేక్షకులు సినిమా చూస్తూ ప్రత్యక్ష-యాక్షన్ షాట్ ల నుండి CGని వేరుగా చూడ‌రు. ఇదే నిజ‌మ‌ని న‌మ్ముతారు కాబ‌ట్టి నిజాయితీగా విజువ‌ల్స్ లో క్వాలిటీ త‌ప్ప‌నిస‌రి. కాబట్టి నాగ్ అశ్విన్ ఎలాంటి నాణ్యమైన దర్శకుడు అనేది ఇప్పుడు తేల‌నుంది. దీనిని అత‌డు ఎంత‌గా రియ‌ల్ ఛాలెంజ్ లా స్వీక‌రిస్తే అంత మంచి క్వాలిటీ విజువ‌ల్స్ ని అందించ‌గ‌ల‌డ‌ని భావిద్దాం. ఆదిపురుష్ లా కాకుండా హైక్వాలిటీ వర్క్ కి భరోసా ఇవ్వాలని అభిమానులు కూడా దర్శకుడిని కోరుతున్నారు. నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా కోసం చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. దాదాఉ 500 కోట్ల బడ్జెట్ ను వెచ్చిస్తున్నార‌ని టాక్ ఉంది.

మ‌రో అవెంజ‌ర్స్ - కెప్టెన్ అమెరికా లేదా బ్యాట్ మేన్ సిరీస్ చూసినంత గ్లింప్స్ ప్రాజెక్ట్ కేలో కావాల‌నుకోవ‌డం స‌హ‌జం. కానీ వాటి బ‌డ్జెట్ల‌తో పోల్చి ప్రాజెక్ట్ కేని చూడ‌కూడ‌దు. అయితే ప‌రిమిత బ‌డ్జెట్లో కూడా హాలీవుడ్ క్వాలిటీని తేవ‌డంలో సైరా- న‌ర‌సింహారెడ్డి- గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి వంటి చిత్రాలు నిరూపించాయి.ఎంత బ‌డ్జెట్ ఉన్నా కానీ ఆర్థిక క‌ష్టాల‌తో శంక‌ర్ 'ఐ' చిత్రం కొన్నిచోట్ల తేలిపోయింది. గ్రాఫిక్స్ లో స‌మ‌స్య‌లు ప్రేక్ష‌కుల‌కు స్ప‌ష్టంగా తెలిసిపోయాయి. ఇక గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవి ఆర్థిక స‌మ‌స్య‌ల న‌డుమ తెర‌కెక్క‌డం వ‌ల్ల అలా అయిపోయింద‌ని కూడా అంతా అనుకున్నారు. ఏది ఏమైనా ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను అశ్విన్- ద‌త్ బృందం ఎదుర్కోకూడ‌ద‌ని భావిద్దాం.

నిజానికి చాలా సినిమాలు పేలవమైన గ్రాఫిక్స్ తో బ‌డ్జెట్ పెట్ట‌లేని నాన్ సింక్ విజువ‌ల్స్ తో స‌మ‌స్యాత్మ‌కంగా మారుతున్నాయి. దానికి కార‌ణం ఎన్నైనా కానీ ప్ర‌జ‌లు చూసేది అంతిమంగా క్వాలిటీ విజువ‌ల్స్ మాత్ర‌మే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.