Begin typing your search above and press return to search.

2500 థియేట‌ర్లు.. 5 భాష‌లు.. కానీ హీరోనే మిస్సింగ్!

By:  Tupaki Desk   |   22 July 2022 4:49 AM GMT
2500 థియేట‌ర్లు.. 5 భాష‌లు.. కానీ హీరోనే మిస్సింగ్!
X
పారిశ్రామిక వేత్త‌లు.. బిజినెస్ మేన్ లు.. రాజ‌కీయ నాయ‌కుల వార‌సులు సినీరంగంపై మ‌క్కువ పెంచుకోవ‌డం స‌హ‌జం. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలిగితే అటుపై వ‌చ్చే కీర్తి ఫాలోయింగ్ అంత గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. అందుకే ఈ రంగాన్ని టార్గెట్ చేస్తుంటారు. కొంద‌రు సీరియ‌స్ గా హీరోలు అవుతుంటే .. మ‌రికొంద‌రు మాత్రం ఆట‌విడుపుగా కూడా ఇక్క‌డికి వ‌స్తుంటారు.

ఇటీవ‌ల త‌మిళ‌నాడుకు చెందిన‌ ఓ ప్ర‌ముఖ బిజినెస్ మేన్ కుమారుడి సినీ ఆరంగేట్రం ఎంతో విచిత్రంగా ఉంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అత‌డు న‌టించిన లెజెండ్ సినిమాని ఏకంగా 5 భాష‌ల్లో 2500 థియేట‌ర్ల‌లో పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల చేస్తున్నారు. అత‌డికి కానీ అతడి కుటుంబీకుల‌కు కానీ అస్స‌లు న‌ట‌నారంగ‌ నేప‌థ్యం అన్న‌దే లేదు. కానీ వార‌సుడిని ఇంత గ్రాండియ‌ర్ గా లాంచ్ చేయాల‌నుకోవ‌డం వెన‌క చాలా పెద్ద లాజిక్ ఉంద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఇంత‌కుముందు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ వార‌సుడు ఉద‌య‌నిధి స్టాలిన్ లాంచింగ్ ఎంతో సింపుల్ గా జ‌రిగినా కానీ.. ఇప్పుడు స‌ద‌రు బిజినెస్ మేన్ అంద‌రినీ డామినేట్ చేస్తూ ధ‌డ పుట్టిస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అయిపోతున్నాయి.

అయితే త‌న సినిమాని మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తుండ‌గా ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాల్లో హీరో క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంత‌కీ లెజెండ్ ఎక్క‌డ‌? అంటూ పంచ్ లు వేస్తున్నారు నెటిజ‌నులు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లోనూ లెజెండ్ ని భారీగా రిలీజ్ చేస్తున్నా ఇక్క‌డ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈనెల 28న రిలీజ్ అంటే కేవ‌లం ఐదు రోజులే స‌మ‌యం మిగిలి ఉంది. కానీ స‌రైన ప్ర‌చార కార్య‌క్ర‌మం కూడా ఏదీ క‌నిపించ‌లేదు.

ఎమోషన్- యాక్షన్- లవ్- కామెడీ- ట్రాజెడీ అంటూ స‌ద‌రు హీరోగారి ఆరంగేట్రం మాత్రం ర‌జ‌నీకాంత్ లెవ‌ల్లో గ్రాండ్ గా ఉంది. ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్ పాట‌లు ఈ విష‌యాన్ని రివీల్ చేసాయి. లెజెండ్ మొద‌టి సినిమాతోనే పెద్ద హీరోల జాబితాలో చేరిపోయాడు అన్న ప్ర‌చారం దీనికి కొస‌రు. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మ‌రో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కం పంపిణీదారు భారీ మొత్తం చెల్లించి త‌మిళ‌నాడు వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 800కి పైగా థియేటర్లలో ది లెజెండ్ విడుదలవుతుండ‌గా ఇత‌ర రాష్ట్రాలు ఓవ‌ర్సీస్ క‌లుపుకుని ఏకంగా 2500 థియేట‌ర్ల‌లో ఈ సినిమాని విడుద‌ల చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

నిజం చెప్పాలంటే అత‌డు న‌ట‌వార‌సులైన‌ రామ్ చ‌ర‌ణ్ కంటే .. మ‌హేష్ కంటే నాగ‌చైత‌న్య - అఖిల్ కంటే గ్రాండ్ గా లాంచ్ అవుతున్నాడు. అంత పెద్ద బ‌డ్జెట్ తో ఈ సినిమా విజువ‌ల్ రిచ్ గా తెర‌కెక్కింది. కానీ తెర‌పై హీరో ఎలా క‌న‌బ‌డ‌తాడు? అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ వీడియోల నుంచి నెటిజ‌నులు మీమ్స్ ఫెస్టివ‌ల్ ని ఆస్వాధిస్తున్నారు.

ది లెజెండ్ వ్య‌వ‌హారం ఎలా ఉన్నా కానీ అప్ప‌ట్లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `అరుణాచ‌లం` మూవీని ఈ సంద‌ర్భంలో గుర్తు చేసుకుంటున్నారు. రూ.30కోట్ల సొమ్మును 30రోజుల్లో ఎలా ఖ‌ర్చు చేయాలి? అన్న‌దానిపై ఈ సినిమా క‌థ ఎంతో లాజిక‌ల్ గా సాగుతుంది. డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం కోసం ఒక డ‌మ్మీని హీరోగా పెట్టి అరుణాచ‌లం (ర‌జ‌నీ) నిర్మాతగా సినిమా కూడా తీస్తాడు. ఆస‌క్తిక‌రంగా ఆ సినిమా పెద్ద హిట్ట‌య్యి డ‌బ్బు ఖ‌ర్చు కాక‌పోగా రెట్టింప‌వుతుంది. ఇప్పుడు `ది లెజెండ్` కూడా అంత ప‌ని చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కూడా పంచ్ లు విసురుతున్నారు.