Begin typing your search above and press return to search.

'ఊర్వశివో రాక్షసివో' సెన్సార్ పూర్తి.. ఫన్ అండ్ రొమాన్స్ తో వస్తోన్న శిరీష్..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 3:33 PM GMT
ఊర్వశివో రాక్షసివో సెన్సార్ పూర్తి.. ఫన్ అండ్ రొమాన్స్ తో వస్తోన్న శిరీష్..!
X
యంగ్ హీరో అల్లు శిరీష్ మరియు మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ''ఊర్వశివో రాక్షసివో''. రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రచారంలో భాగంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించగా.. దీనికి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్టుగా హాజరై ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన 'ఊర్వశివో రాక్షసివో' ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. మరోవైపు హీరో అల్లు శిరీష్ కాలేజీలు సందర్శిస్తూ తన సినిమాని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు.

‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ ను జారీ చేసారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నేటి యువతరం భావాలకు అద్దంపట్టే అంశాలతో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలుస్తోంది.

సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు.. ఒక మోడ్రన్ గర్ల్ తో ప్రేమలో పడి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ప్రేమ మరియు వ్యామోహానికి వ్యత్యాసం ఏంటి? అనే ఆసక్తికరమైన పాయింట్స్ తో ఫుల్ ఫన్ అండ్ రొమాన్స్ కలబోసి ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇది ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అలానే అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.

తమిళ్ లో హిట్టైన 'ప్రేమ ప్యార్ కాదల్' ఆధారంగా ఈ సినిమా రూపొందిందనే సంగతి తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - సునీల్ - పోసాని కృష్ణ మురళి - ఆమని - శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. తమ్మారెడ్డి భరద్వాజ - ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం సంయుక్తంగా నిర్మించారు. అచ్చు రాజ‌మ‌ణి మరియు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. త‌న్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

సెన్సార్ తో సహా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న 'ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయనున్నారు. 'ఏబీసీడీ' తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.