Begin typing your search above and press return to search.

‘గ్యాంగ్’ గేమ్ షురూ...

By:  Tupaki Desk   |   8 Jan 2018 5:07 AM GMT
‘గ్యాంగ్’ గేమ్ షురూ...
X
సంక్రాంతి సినిమాల పందెం ఎల్లుండి నుంచి మొదలు కానుంది. అత్యధిక స్క్రీన్స్ తో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి దీనికి వెల్కం చెబుతుండగా 12న బాలకృష్ణ జైసింహ - సూర్య గ్యాంగ్ దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. అది అక్కడితో ఆగక ఒక్క రోజు గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ రంగుల రాట్నం తో క్లైమాక్స్ కు చేరుకుంటుంది. సూర్య గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లోనే మకాం వేసి మీడియాకు పూర్తిగా అందుబాటులో ఉంటున్నాడు. ఒరిజినల్ వెర్షన్ తమిళ్ ను కాదని మరీ ఇక్కడ తిష్ట వేయడానికి కారణం పోటీని తట్టుకోవాలి అంటే ప్రమోషన్ మామూలుగా ఉంటే సరిపోదని గుర్తించడమే. అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉంది కాని సూర్య సినిమాకే బజ్ ఎక్కువగా ఉంది. అందుకే ఫోకస్ ఇక్కడ పెంచే ఉద్దేశంతో యువి సంస్థ చాలా ప్లాన్డ్ గా ముందుకు వెళ్తోంది.

ఒకేవారంలో నాలుగు సినిమాలు వస్తున్నాయి కాబట్టి సహజంగానే థియేటర్ల సమస్య వస్తుంది. పైగా పవన్ - బాలయ్య లోకల్ స్టార్ హీరోస్ కాబట్టి స్క్రీన్స్ తక్కువగా ఉండే బిసి సెంటర్స్ లో వాటి కోసం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది ముందే గుర్తించిన యువి సంస్థ దానికి తగ్గ ఏర్పాట్లలో భాగంగా గ్యాంగ్ కు కనీసం 300 థియేటర్లు దక్కేలా ప్లాన్ చేసుకుని ముందుగానే వాటిని గుర్తించి అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నట్టు టాక్. అయితే ఇదంతా ఉన్నట్టుండి జరుగుతున్న వ్యవహారం కాదు. పోటీ అనివార్యం అని నెల క్రిందటే తెలిసింది కాబట్టి అప్పటి నుంచే ప్రయత్నాల్లో ఉన్నారు. యువి ఆధీనంలో ఉండే వి సెల్యులాయిడ్ స్క్రీన్లు - గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉండే థియేటర్లు ఎక్కువగా గ్యాంగ్ కోసం వచ్చేలా సెట్ చేసుకుంటున్నట్టు ట్రేడ్ టాక్. సూర్య ఈ విషయంలో పూర్తిగా సహకరించేందుకు సిద్ధపడే హైదరాబాద్ క్యాంపు వచ్చాడట. రంగుల రాట్నం వస్తోంది అన్నపూర్ణ బ్యానర్ కాబట్టి వాళ్ళ పరిథిలో వాళ్ళు డబుల్ సెంచరీ మీద కన్నేశారు. జైసింహ సంగతి సరేసరి. బాలయ్య మాస్ ఇమేజ్ - ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా సి.కళ్యాణ్ భారీ విడుదలే ప్లాన్ చేసారు. మరి గ్యాంగ్ ప్రమోషన్ గేమ్ ఎంత వరకు రిజల్ట్ ఇస్తుంది అనేది మూడు రోజుల్లో తేలనుంది.