Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'వి'

By:  Tupaki Desk   |   5 Sep 2020 12:00 PM GMT
మూవీ రివ్యూ : వి
X
చిత్రం : ‘వి’

నటీనటులు: నాని-సుధీర్ బాబు-అదితిరావు హైదరి-నివేథా థామస్-వెన్నెల కిషోర్-హరీష్ ఉత్తమన్-ఆదర్శ్ బాలకృష్ణ-తనికెళ్ల భరణి-జయప్రకాష్-శ్రీకాంత్ అయ్యంగార్-నరేష్-రోహిణి తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: పి.జి.విందా
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్-హర్షిత్ రెడ్డి
రచన-దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

థియేటర్లు అందుబాటులో లేని కరోనా వేళ.. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. కానీ అవన్నీ చిన్న స్థాయివే. ఇప్పుడు ఓ పేరున్న చిత్రం థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. వి. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ‘ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: హైదరాబాద్‌ పాతబస్తీలో మత కల్లోలాలు జరుగుతుంటే అక్కడికెళ్లి 30 మందిని ప్రాణాలతో బయట పడేసినందుకు డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)ను ప్రభుత్వం ‘శౌర్య’ పతకంతో సత్కరిస్తుంది. ఈ ఆనందంలో అతనందరికీ పార్టీ ఇచ్చిన రాత్రి ఒక పోలీసాఫీసర్ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసిన వ్యక్తి.. తాను ఇంకో నలుగురిని చంపబోతున్నట్లు సంకేతాలివ్వడం ద్వారా ఆదిత్యను సవాలు చేస్తాడు. ఈ కేసును ఛేదించేందుకు ఆదిత్య తన ప్రయత్నాలు చేస్తుండగానే.. హంతకుడు చెప్పినట్లే ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ వెళ్తాడు. మూడో హత్య తర్వాత ఈ దారుణాలు చేస్తోంది విష్ణు (నాని) అనే మాజీ సైనిక అధికారి అని ఆదిత్యకు అర్థమవుతుంది. అతడి గురించి వివరాలన్నీ సేకరిస్తాడు. మరి నిజంగానే విష్ణునేనా ఆ హంతకుడు.. అదే నిజమైతే అతనెందుకలా చేస్తున్నాడు.. మిగతా రెండు హత్యలు చేయకుండా విష్ణును ఆదిత్య ఆపగలిగాడా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: థియేటర్లు మూతపడి ఉన్న ఈ ఆరు నెలల కాలంలో ఓటీటీల హవా మామూలుగా లేదు. అంతకుముందు వీటితో సంబంధం లేనట్లున్న వాళ్లు కూడా కొత్తగా సబ్‌స్క్రిప్షన్లు తీసుకుని అన్ని భాషల్లో పేరున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ లను వెతికి వెతికి చూస్తున్నారు. క్వాలిటీ కంటెంట్ టెరాబైట్లలో దొరుకుతోంది. వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంచి ఎంచి మరీ చూస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని బట్టి జానర్లు వేరు చేసి మరీ కంటెంట్ అందిస్తున్నాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. థ్రిల్లర్ జానర్లో సినిమాలు చూడాలనుకుంటే ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కొదవే లేదు. సీరియల్ కిల్లర్ కథలే తీసుకుంటే.. సైకో (తమిళం).. అంజామ్ పత్తిర, ఫోరెన్సిక్ (మలయాళం) లాంటి సినిమాలు కావాల్సినంత మజానందిస్తాయి. గత ఏడాది తమిళం నుంచి రీమేక్ అయిన ‘రాక్షసుడు’ సైతం ఈ జానర్లో టాప్ నాచ్ మూవీనే. అది కూడా ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాలు చూస్తున్న సమయంలో అదే జానర్లో ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి సెన్సిబుల్, ఇంటలిజెంట్ డైరెక్టర్ నుంచి సినిమా అంటే ఎంతో ఆశిస్తాం. ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఆ ఆశలకు, అంచనాలకు చాలా దూరంలో ఆగిపోతుంది.. వి.

‘వి’ సినిమాలో హంతకుడెవరో తెలుసుకున్న పోలీసాఫీసర్.. ‘‘నీకు జరిగిన అన్యాయానికి బాధ్యులెవరో చెప్పు వాళ్లకు శిక్ష పడేలా నేను చూస్తా’’ అంటాడు. దానికి కిల్లర్.. ‘‘పాత సినిమాల్లో లాయర్లు అరగ్గొట్టేసిన డైలాగుల్లా ఉందిది’’ అంటాడు. ఒక దశ దాటాక ‘వి’ సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులకు ఇలాంటి ‘అరగ్గొట్టేసిన’ ఫీలింగే కలిగితే ఆశ్చర్యం లేదు. ఒక సీరియల్ కిల్లర్.. వరుసబెట్టి హత్యలు చేస్తుంటాడు. అన్నింట్లోనూ ఒక ప్యాటెర్న్ పాటిస్తుంటాడు. క్లూస్ వదులుతుంటాడు. ఒక ఇంటలిజెంట్ ఆఫీసర్ కేసును ఛేదించే బాధ్యత తీసుకుంటాడు. ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌన్ గేమ్.. ఆపై కిల్లర్ మోటివ్ ఏంటని తెలుస్తుంది. అతడికో ఫ్లాష్ బ్యాక్. అందులో అతడికి అన్యాయం చేసిన వాళ్లపై అతను ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు చూశాం ఇప్పటికే. ఐతే వాటి నుంచి ‘వి’ని భిన్నంగా నిలబెట్టే అంశాలేవే లేకపోవడం పెద్ద మైనస్. పేరుకు థ్రిల్లర్ సినిమానే కానీ.. ఇందులో ఉత్కంఠ అన్న మాటే లేదు. చివరి వరకు ‘విషయం’ దాచి పెట్టారు కాబట్టి సినిమాలో ‘సస్పెన్స్’ ఫ్యాక్టర్ ఉంది అనుకోవాలి తప్పితే.. అసలేం జరిగి ఉండొచ్చు అనే ఆసక్తి రేకెత్తించడంలో ‘వి’ విఫలమైంది.

సైకో కిల్లర్ పాత్రలో మరో నటుడెవరైనా ఉండుంటే.. ఆ కిల్లర్ ఉద్దేశమేంటి అనే విషయంలో రకరకాల సందేహాలు కలగడానికైనా అవకాశముండేది. కానీ అక్కడున్నది నాని. అతణ్ని పైశాచికానందం కోసం హత్యలు చేసే శాడిస్టుగా చూపిస్తారని ఎవరూ అనుకోరు. కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్‌లో అతను మంచోడై ఉంటాడని.. తనకు జరిగిన అన్యాయానికి ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడని ముందే ఒక అంచనాకు వచ్చేస్తాం. ఆ అంచనాకు ఏమాత్రం తగ్గని ఒక మామూలు ఫ్లాష్ బ్యాక్ ‘వి’ మరింత సాధారణంగా మార్చేసింది. దీని కంటే ముందు కిల్లర్ చేసే హత్యల్లో కానీ.. వాటిని ఛేదించేందుకు పోలీసాఫీర్ సాగించే పరిశోధనలో కానీ.. ఏమీ వైవిధ్యం కనిపించదు. ఆదర్శ్ బాలకృష్ణను పాత్రను చంపే ఒక్క చోట కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ప్రేక్షకుల్లో ఉన్న కొంచెం ఆసక్తిని కూడా ఫ్లాష్ బ్యాక్ నీరుగార్చేశాక.. కనీసం క్లైమాక్స్ అయినా ‘థ్రిల్లర్’ జానర్‌ కు న్యాయం చేసేలా ఉంటుందేమో అని చూస్తే ఒక మామూలు ‘ట్విస్టు’తో దాన్ని ముగించారు. ముగింపు చూస్తే సీక్వెల్ సంకేతాలు కనిపిస్తాయి కానీ.. దాని పట్ల ఏ కాస్త ఆసక్తిని కూడా నిలిపి ఉంచేలా చేయడంలో ‘వి’ సఫలం కాలేదు.

‘వి’లో చెప్పుకోదగ్గ పాజిటివ్ అంటే.. ‘రిచ్ నెస్’ మాత్రమే. ఆరంభం నుంచి చివరి దాకా ఒక ‘రిచ్’ లుక్ కనిపిస్తుంది. పేరున్న తారాగణం.. ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలో ఒక క్వాలిటీ కనిపిస్తుంది. కానీ ఆ క్వాలిటీ కథాకథనాల్లో లేకపోవడమే మైనస్. మామూలుగా నాని సినిమా అంటే ఫ్యామిలీస్ అంతా కూర్చుని చూసేలా ఉంటుంది. కానీ డార్క్ స్టయిల్లో సాగే ‘వి’ని చూడటం మొదలుపెట్టాక ఫ్యామిలీ ఆడియన్స్ మిడిల్ డ్రాప్ అయిపోతే ఆశ్చర్యమేమీ లేదు. నాని ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని అక్కడక్కడా ఆ పాత్రతో వినోదం పండిద్దామని చూశారు కానీ.. అది బెడిసికొట్టింది. నాని పాత్రను స్టైలిష్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం కూడా అంత ఫలితాన్నివ్వలేదు. మొత్తంగా చెప్పాలంటే.. ‘వి’ అన్ని రకాలుగా నిరాశకు గురి చేసి ఓటీటీ స్థాయికీ ఇది తగదు అనిపిస్తుంది.

నటీనటులు: పాత్ర ఎలాంటిదైనా దాన్ని ఓన్ చేసుకుని రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తాడు నాని. నెగెటివ్ షేడ్స్ ఉన్న విష్ణు పాత్ర విషయంలో కూడా అదే ప్రయత్నం చేశాడు కానీ.. అతను దీనికి ‘ఫిట్’ అని అయితే అనిపించడు. ఇంతకుముందు ఇంద్రగంటితోనే చేసిన ‘జెంటిల్ మేన్’ తరహాలో ఈ పాత్ర మిస్టీరియస్ గా అనిపించదు. ముందే పాత్ర మీద ఒక అంచనాకు వచ్చేసేలా దాన్ని తీర్చిదిద్దడం ప్రతికూలంగా మారింది. మేనరిజమ్స్ కొత్తవి ట్రై చేసి.. వాయిస్ మాడ్యులేషన్ కొంత మార్చి.. నాని తన వంతుగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ విష్ణు పాత్ర అనుకున్న స్థాయిలో పండలేదు. పాత్ర బలహీనతల వల్ల నాని పెర్ఫామెన్స్ కూడా సాధారణంగానే అనిపించొచ్చు. సుధీర్ బాబు తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. యాక్షన్ ఎపిసోడ్లో అతడి లుక్ వావ్ అనిపిస్తుంది. సటిల్ పెర్ఫామెన్స్ తో ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. ఇంతకుముందు ఇంద్రగంటితోనే చేసిన ‘సమ్మోహనం’ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంది. నివేథా థామస్ పాత్రలో ఏ విశేషం లేదు. తన పెర్ఫామెన్స్ ఓకే. అదితిరావు పాత్రను ప్రోమోల్లో దాచి పెట్టి ఆశలు పెంచారు కానీ.. వాటిని నీరుగార్చేలా సాగింది ఆమె పాత్ర. వెన్నెల కిషోర్ అక్కడక్కడా కొన్ని పంచులు వేశాడు కానీ.. అవి సినిమాలో సింక్ అవ్వలేదు. ప్రధాన విలన్ పాత్రలో కనిపించిన హరీష్ ఉత్తమన్ కు పెర్ఫామ్ చేయడానికి స్కోపే లేకపోయింది. నరేష్.. తనికెళ్ల భరణి లాంటి వాళ్ల పాత్రలనూ వృథా చేశాడు దర్శకుడు.

సాంకేతిక వర్గం: సాంకేతికంగా ‘వి’ ఉన్నతంగానే కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ పాయింట్. దిల్ రాజు బేనర్ స్థాయికి తగ్గట్లే రిచ్ గా సినిమాను తెరకెక్కించారు. పి.జి.విందా కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అమిత్ త్రివేది పాటల్లో నేనేనా వచ్చేస్తున్నా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు ఓకే. అయితే పాటలు ఆగి ఆస్వాదనిపించే స్థాయిలో లేవు. ఒక థ్రిల్లర్ సినిమాకు అవసరమైన ఎక్కువ పాటలుండి.. నిడివి పెరగడానికి కారణమయ్యాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ గొప్పగా లేదు. తీసిపడేసేలా లేదు. చిత్రంగా ‘రాక్షసుడు’ సినిమా థీమ్ మ్యూజిక్ కొన్ని చోట్ల వినిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకప్పుడైతే లైట్ తీసుకునేవాళ్లం కానీ.. తమన్ ఇప్పుడున్న ఫాంలో ఇలాంటివి ఊహించలేం. ఇక రచయిత, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విషయానికి వస్తే.. ఆయన సినిమాల్లో అత్యంత బలమైన వాటిలో ‘వి’ కచ్చితంగా చోటు దక్కించుకుంటుంది. ఇంతకుముందు ‘జెంటిల్ మేన్’ సినిమాలో థ్రిల్ చేయగలిగిన ఇంద్రగంటి.. ఈసారి ఈ జానర్ పై తనకు పట్టే లేదు అన్నట్లుగా కనిపించాడు. ఒక థ్రిల్లర్ సినిమాలో ఆయన లాంటి తెలివైన దర్శకుడి నుంచి కొన్ని పజిల్స్ ఆశిస్తాం. కానీ సినిమాలో ఎక్కడా పెద్దగా ‘ఇంటలిజెన్స్’ కనిపించదు. సాధారణమైన కథకు.. అంతే సాధారణమైన స్క్రీన్ ప్లేతో ఇంద్రగంటి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. ‘వి’ చూశాక ఆయన్నుంచి మళ్లీ ఓ ‘సమ్మోహన’మైన సినిమానే ఆశిస్తాం.

చివరగా: ‘వి’ఫల యత్నం!

రేటింగ్-2.25/5