Begin typing your search above and press return to search.

'కొండ పొలం' కోసం అడవిలోపడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీకాదు: వైష్ణవ్ తేజ్

By:  Tupaki Desk   |   8 Oct 2021 3:30 AM GMT
కొండ పొలం కోసం అడవిలోపడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీకాదు: వైష్ణవ్ తేజ్
X
చాలాకాలం క్రితం నవలా సాహిత్యం నుంచి సినిమాలు వచ్చాయి. ఏఎన్నార్ .. చిరంజీవి .. శోభన్ బాబు .. కృష్ణ వీరంతా కూడా నవలా సాహిత్యం నుంచి వచ్చిన కథలతో చాలా విజయాలనే అందుకున్నారు. ఆ తరువాత కాఫీ తాగే లోగా కథ పుట్టడం మొదలైంది. అప్పటి నుంచి నవలకు .. సినిమాకి మధ్య లింక్ తెగిపోయింది. మళ్లీ ఇంతకాలానికి 'కొండ పొలం' అనే ఒక నవలను తీసుకుని, అదే టైటిల్ తో ఆ కథను దర్శకుడు క్రిష్ రూపొందించాడు. వైష్ణవ్ తేజ్ .. రకుల్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ రోజున ప్రేక్షకులను పలకరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ మాట్లాడాడు.

"ఈ సినిమాకి ముందు ఈ నవలను నేను చదవలేదు. 'కొండ పొలం' అనే అంశమే కొత్తది .. నేను ఎప్పుడూ వినలేదు .. చూడలేదు. క్రిష్ గారి టేకింగ్ .. కథలోని ఫాంటసి ఎలిమెంట్ .. టైగర్ కి సంబంధించిన అంశం ఇవన్నీ కొత్తగా అనిపించడంతో ఈ సినిమాను చేయాలనుకున్నాను. క్రిష్ గారితో నాకు ముందు నుంచి మంచి పరిచయం ఉంది. ఒకసారి ఆయన కాల్ చేసి .. కలుద్దామని అంటే అలాగే అన్నాను. ఒక సినిమా విషయమై కాల్ చేసినట్టు ఆయన చెబితే, ఆ సినిమా ఏదైనా అది 'హరి హర వీరమల్లు' తరువాతనే కదా ఉంటుందని అనుకున్నాను.

అదే మాట ఆయనతో అంటే .. 'వీరమల్లు' కంటే ముందుగానే ఉంటుందని అన్నారు. ఈ సినిమా కోసం క్రిష్ గారిని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన సినిమాలు 'వేదం' .. 'గమ్యం' అంటే నాకు చాలా ఇష్టం.

ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి .. అలాగే ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా షూటింగు మొదలుపెట్టే సమయానికి కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆ పరిస్థితుల్లో అంతమందితో కలిసి షూటింగ్ చేయడం ఒక సాహసమే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మాస్కులు పెట్టుకుని ఉండటం చాలా కష్టమైన విషయం. ఒకటి రెండు రోజుల పాటు ఇబ్బందిగా అనిపించినా, ఆ తరువాత అలవాటైపోయింది.

అడవిలో వెహికల్స్ వెళ్లని ప్రదేశాలకు నడవాల్సి వచ్చేది. అలా చాలా దూరం నడిచాం. పాపం కొంతమంది అవస్థ చూడలేక నేను కూడా బరువులు మోశాను. నా పాత్ర వరకూ క్రిష్ గారు ఎలా చెబితే అలా చేశాను .. కాకపోతే ఆడియన్స్ కి ఎలా బాగుంటుందని అలోచించి చేశాను. యాస కూడా పెర్ఫెక్ట్ గా మాట్లాడానికి ప్రయత్నించాను. 'ఉప్పెన' సినిమాకి అంతా కొత్తవాళ్లం కనుక నడిచిపోయింది. ఎలాంటి బెరుకు లేకుండా చేశాను. కానీ ఇక్కడ అంతా నా కంటే సీనియర్స్. వాళ్ల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అలాంటివాళ్లతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

కోట గారు ఈ వయసులో అంతదూరం వచ్చి ఈ సినిమా చేయడం విశేషం. షూటింగు సమయంలో ఆయన అందరితో ఎంతో సరదాగా ఉండేవారు. ఆయన కోసం మేము కరోనా నియమాలు మరింత కఠినంగా పాటించాము. ఇక సాయిచంద్ గారు ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటూ, షూటింగు సమయంలో బోర్ అనేది తెలియకుండా చేశారు. ఈ సినిమా వలన గొర్రెల సైకాలజీ అర్థమైపోయింది. ఒకటి ఏది చేస్తే మిగతావన్నీ అదే చేస్తాయనే విషయాన్ని ప్రత్యక్షంగా చూశాను. పులి బొమ్మచేసి .. అది ఏ టైమ్ లో ఏం చేస్తుందన్నది చెబుతూ నా నుంచి రావలసిన ఎక్స్ ప్రెషన్స్ ను క్రిష్ రాబట్టారు.

స్క్రిప్ట్ బాగుంది .. క్రిష్ బాగా తీశారని చెప్పే స్థాయికి నేను ఇంకా రాలేదు. ఇక నేను ఎలా చేశానేది మీరే చెప్పాలి. కీరవాణి గారి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళుతుంది. జ్ఞాన శేఖర్ గారి సినిమాటోగ్రఫీ గొప్పగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడారు .. కానీ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చేవారు. అన్నయ్య విషయానికి వస్తే బాగానే ఉన్నాడు .. త్వరగానే కోలుకుంటున్నాడు. 'లవ్ స్టోరీ' కథ ముందుగా నా దగ్గరికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు .. అందులో నిజం లేదు. ప్రస్తుతం గిరీశయ్యతో ఒక చేస్తున్నాను అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.