Begin typing your search above and press return to search.

వైష్ణ‌వ్ తేజ్ కూడా డేట్ ఇచ్చేశాడు

By:  Tupaki Desk   |   11 Feb 2022 5:30 PM GMT
వైష్ణ‌వ్ తేజ్ కూడా డేట్ ఇచ్చేశాడు
X
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్‌. మెగా మేన‌ల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా తొలి చిత్రం `ఉప్పెన‌`తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ ల సునామీని సృష్టించాడు. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని తొలి సినిమాతో వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన తొలి హీరోగా రికార్డుని ద‌క్కించుకున్నాడు. న‌టుడిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న వైష్ణ‌వ్ తేజ్ కు `కొండ పొలం`తో ఎదురుదెబ్బ త‌గిలింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ ఫేమ‌స్ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కినా వైష్ణ‌వ్ తేజ్ కు మాత్రం ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందించలేక‌పోయింది.

ఈ మూవీ త‌రువాత రెండు చిత్రాల‌ని లైన్ లో పెట్టిన వైష్ణ‌వ్ తేజ్ అందులో ముందుగా `రంగ రంగ వైభ‌వంగ‌` చిత్రాన్ని పూర్తి చేశాడు. కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ద్వారా `ఆదిత్య వ‌ర్మ‌` ఫేమ్ గిరీషాయ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, టైటిల్ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా చిత్ర బృందం శుక్ర‌వారం సాయంత్రం అధికారికంగా వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ వున్న కొత్త పోస్ట‌ర్ ని విడుద‌ల‌ చేశారు. `రిషీ - రాధ‌ల‌ని మీ స‌మీప థియేట‌ర్ల‌లో క‌ల‌వ‌డానికి సిద్ధంగా వుండండి. ఈ చిత్రాన్ని మే 27న రిలీజ్ చేస్తున్నాం` అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఛాయాగ్ర‌హ‌ణం శ్యామ్ ద‌త్ సైనొద్దీన్‌... ఆర్ట్ అవినాష్ కొల్ల‌... పాట‌లు శ్రీ‌మ‌ణి.