Begin typing your search above and press return to search.

#వ‌కీల్ సాబ్‌.. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందం

By:  Tupaki Desk   |   20 April 2021 3:30 AM GMT
#వ‌కీల్ సాబ్‌.. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందం
X
స‌రిగ్గా వ‌కీల్ సాబ్ రిలీజ్ కి ఒక‌రోజు ముందు పొలిటిక‌ల్ డ్రామా తెలిసిన‌దే. ఈ సినిమాకి అద‌న‌పు షోల‌ను ర‌ద్దు చేయ‌డ‌మే గాక టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు జీవో విడుద‌లైంది. అయినా కానీ అవేవీ వ‌కీల్ సాబ్ దూకుడును త‌గ్గించ‌లేక‌పోయాయి. వ‌కీల్ సాబ్ తొలి వీకెండ్ త‌ర్వాత సోమ మంగ‌ళ వారానికే 100 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని తాకింద‌ని క‌థ‌నాలొచ్చాయి. నిజానికి ప‌వ‌ర్ స్టార్ మానియా బాక్సాఫీస్ వ‌ద్ద క‌రోనా భ‌యాల్ని అధిగ‌మించింది. అస‌లు టిక్కెట్టు రేటు అన్న‌ది ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్న‌ట్టు కూడా క‌నిపించ‌లేదు.

వీలున్నంత వ‌ర‌కూ అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం ద్వారా రిట‌ర్నులు తేవ‌డంలో దిల్ రాజు వ‌ర్గాలు చేసిన ప‌ని వ‌ర్క‌వుటైంది. అందుకే ఆయ‌న మీడియా మీట్ లో రాబ‌ట్టాల్సింది రాబ‌ట్టేశాం అని ధీమాగా ప్ర‌క‌టించి వ‌సూళ్ల లెక్క‌ల్ని దాటవేశారు. తొలి వీకెండ్ తో పాటు.. ఉగాది కి అలాగే అదే స‌మ‌యంలో అంబేద్క‌ర్ జ‌యంతి సెలువులు కూడా వ‌కీల్ సాబ్ కి క‌లిసొచ్చాయి.

ఇక‌పోతే వ‌కీల్ సాబ్ రిలీజైన త‌ర్వాత రావాల్సిన ల‌వ్ స్టోరి వాయిదా ప‌డింది. అస‌లు ఆ సినిమా రాక‌తో సంబంధం లేకుండానే వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు స‌హ‌జంగానే త‌గ్గాయి. ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి తో భ‌యాలు జ‌నంపై ప్ర‌భావం చూపాయి. పైగా ఫ్యామిలీస్ లేడీస్ రావాల్సి ఉన్నా.. ఇండ్ల నుంచి ఎవ‌రూ క‌ద‌ల‌లేని స‌న్నివేశం నెల‌కొంది. వెర‌సి రెండో వారంలో భారీగా డ్రాప్స్ క‌నిపించాయి.

తొలి వీకెండ్ చాలా చోట్ల నాన్ బాహుబ‌లి రికార్డుల్ని బ్రేక్ చేసిన వ‌కీల్ సాబ్ ఇంత వేగంగానే ప‌డిపోవ‌డానికి కార‌ణం సెకండ్ వేవ్ ప్ర‌భావ‌మేన‌ని అంచ‌నా వేస్తున్నారు. రెండో వీకెండ్ అస‌లు క‌లిసి రాలేదు. రిపీట్ ఆడియెన్ లేరు. దీంతో ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి మిస్స‌య్యింద‌ని ట్రేడ్ చెబుతోంది.

ఇక దీనికి తోడు చాలా చోట్ల కొత్త ప్ర‌భుత్వ జీవోతో చిక్కులొచ్చి పడ్డాయి. అస‌లే క‌ష్టంలో ఉన్న ఎగ్జిబిష‌న్ రంగంపై కొత్త టిక్కెట్టు ధ‌ర‌లు మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందం అయ్యింద‌న్న వాద‌న బ‌లంగా ఉంది. ఒక ర‌కంగా రెండో వారంలో చాలా థియేట‌ర్లు మూసివేయ‌డానికి కార‌ణం టిక్కెట్టు పంచ్ అని కూడా అంచ‌నా వేస్తున్నారు. క‌రోనా భ‌యాలు ఒక‌వైపు.. క‌లిసి రాని టిక్కెట్టు ధ‌ర ఇంకోవైపు ఎగ్జిబిట‌ర్ల‌ను నిరాశ‌లో కూరుకుపోయేలా చేసింద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. కొన్నిచోట్ల టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపుతో థియేట‌ర్లు స్వ‌చ్ఛందంగా మూసేశార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.