Begin typing your search above and press return to search.

వక్కంతం వంశీ కూడా యుద్ధం ప్రకటించాడు

By:  Tupaki Desk   |   20 Sep 2016 11:30 AM GMT
వక్కంతం వంశీ కూడా యుద్ధం ప్రకటించాడు
X
తెలుగు సినిమాల్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది ప్రస్తుతం. రచయితలందరూ ఒక్కొక్కరుగా దర్శకులుగా మారిపోతున్నారు. ఐతే మెగా ఫోన్ పట్టే అవకాశం వచ్చిన రచయితలందరూ అప్పటిదాకా తాము ఎదుర్కొన్న ఇబ్బందులపై అసహనం వ్యక్తం చేయడాన్ని గమనించవచ్చు. ‘సింహా’ సినిమా విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కొరటాల ఆవేదన వ్యక్తం చేయడం.. తాను దర్శకుడిగా మారడానికి రచయితగా జరిగిన అన్యాయమే కారణమని చెప్పడం తెలిసిందే. ఇటీవలే మరో ప్రముఖ రచయిత డైమండ్ రత్న బాబు కూడా టాలీవుడ్లో రచయితలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించాడు. తాజాగా వక్కంతం వంశీ కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. దర్శకులు రచయితలకు అన్యాయం చేస్తున్నట్లు చెప్పాడు. తాను దర్శకుడిగా మారబోతుండటానికి కూడా ఇదే కారణం అన్నాడు.

‘‘ఒక సినిమా పూర్త‌యిన త‌ర్వాత ఆ సినిమాకి సంబంధించి ఎన్నో ప్రెస్ మీట్లు జ‌రుగుతాయి. ఆ సినిమాకి హీరో ఎవ‌రో.. దర్శ‌కుడెవరో.. సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రో అంద‌రికీ తెలుస్తుంది కానీ ఆ సినిమా ర‌చ‌యిత మాత్రం తెలియ‌డం లేదు. ఆడియో ఫంక్షన్లో నీ పేరు చెప్పడం మరిచిపోయాను సారీ అంటారు దర్శక నిర్మాతలు. ఒక్కోసారి రచ‌యిత రాసిన క‌థను స‌గం మార్చేస్తారు. ఇదేంటని అడిగితే.. హీరో ఇలాగే కావాలి అన్నాడు అని చెబుతారు. సినిమా స‌క్సెస్ అయితే కథ నాదే.. రైటర్ మొదట్నుంచి తిరుగుతున్నాడు కాబట్టి క్రెడిట్ ఇచ్చాను అని డైరెక్టర్ హీరోకు చెబుతాడు. ఇలా చాలామందికి జరుగుతుంది. కాకపోతే ఒక్కో రచయితకు ఒక్కోలా జరుగుతుంది. నా పనితనం గురించి అందరికీ తెలియాలి కాబట్టే డైరెక్షన్ చేయబోతున్నాను’’ అని తాను దర్శకుడిగా మారాలనుకోవడానికి రీజన్ చెప్పాడు వంశీ.