Begin typing your search above and press return to search.

నా పేరు సూర్య.. ఎన్టీఆర్ ది కాదు

By:  Tupaki Desk   |   4 May 2018 3:58 AM GMT
నా పేరు సూర్య.. ఎన్టీఆర్ ది కాదు
X
తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా పరిచయమై.. ఆ తర్వాత రచయిత అవతారమెత్తి స్టార్ స్టేటస్ సంపాదించాడు వక్కంతం వంశీ. చాలామంది రచయితల్లాగే అతను కూడా దర్శకుడిగా మారాలనుకున్నాడు. రచయితగా అతను తెచ్చుకున్న పేరుకి చాలా సులువుగా.. వేగంగా దర్శకుడిగా మారాల్సింది. కానీ ఆ విషయంలో బాగా ఆలస్యమైంది. రెండేళ్ల కిందటే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా ఓకే అయి.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చాక అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. వక్కంతం సినిమాను పక్కన పెట్టి బాబీతో ‘జై లవకుశ’ చేశాడు ఎన్టీఆర్. దీంతో కొన్ని నెలల పాటు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న వక్కంతం.. అల్లు అర్జున్ కు కథ చెప్పి మెప్పించి ‘నా పేరు సూర్య’ చేశాడు. ఎన్టీఆర్ వద్దన్న కథతోనే బన్నీని మెప్పించాడేమో.. తనకు అవకాశమిచ్చినట్లే ఇచ్చి హ్యాండిచ్చినందుకు ఎన్టీఆర్ మీద వక్కంతం చాలా కోపంగా ఉన్నాడేమో అని అంతా అనుకుంటున్నారు.

ఐతే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అంటున్నాడు వక్కంతం. ఎన్టీఆర్ కు తాను చెప్పిన కథ వేరని.. ఆ కథ విషయంలో పూర్తి సంతృప్తి చెందకపోవడంతో పక్కన పెట్టేయాల్సి వచ్చిందని వంశీ చెప్పాడు. ఇద్దరం కలిసి తర్వాత పని చేద్దామన్న మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీద తామిద్దరం విడిపోయినట్లు అతను చెప్పాడు. ఎన్టీఆర్ కథ అలాగే ఉందని.. దాన్ని ఎప్పటికైనా ఎన్టీఆర్ తోనే చేయాల్సి ఉందని.. బన్నీతో చేసింది వేరే కథతో అని వంశీ చెప్పాడు. నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ అల్లు అర్జున్ కోసం కథ అడగడంతో తన స్టోరీ బ్యాంక్ బయటికి తీసి అందులోంచి ‘నా పేరు సూర్య’ కథను ఎంచుకున్నట్లు అతను వెల్లడించాడు. ఇది తన అరంగేట్రానికి.. బన్నీకి సరిగ్గా సరిపోయే స్టోరీ అని భావించానన్నాడు. మరి ఈ సినిమాతో తనేంటో రుజువు చేసుకుని ముందు అనుకున్న కథతోనే ఎన్టీఆర్ హీరోగా వక్కంతం సినిమా తీస్తాడేమో చూద్దాం.