Begin typing your search above and press return to search.

వంశీని ద‌త్త‌త తీసుకున్న గీతా ఆర్ట్స్

By:  Tupaki Desk   |   3 May 2018 5:30 PM GMT
వంశీని ద‌త్త‌త తీసుకున్న గీతా ఆర్ట్స్
X
ఈ మ‌ధ్య టాలీవుడ్లో ఓ కొత్త సంప్ర‌దాయం మొద‌లైంది. ఓ ద‌ర్శ‌కుడు ఓ బ్యాన‌ర్లో సినిమా తీస్తే ఆయ‌న త‌ర్వాతి సినిమాలను కూడా అదే బ్యాన‌ర్లో చేయ‌డానికి ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. దిల్ రాజు మొద‌లెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు అంద‌రు నిర్మాత‌ల‌కు అలవాటైంది. ఇప్పుడు ర‌చ‌యిత‌గా మారి తొలి సినిమాతోనే మంచి హైప్ తెచ్చుకున్న వ‌క్కంతం వంశీ కూడా ఇలా రెండో సినిమాకి బుక్క‌య్యాడు.

ప్ర‌స్తుతం బ‌న్నీతో ‘నా పేరు సూర్య‌- నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నాడు వ‌క్కంతం వంశీ. బ‌న్నీతో సినిమా అంటే డైరెక్టుగా గీతా ఆర్ట్స్ తో సినిమా చేయ‌క‌పోయినా ఆ సినిమా గురించి పూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ అల్లు అర‌వింద్ చేస్తునే ఉంటాడు. దాంతో వ‌క్కంతం వంశీ టేకింగ్ కి ఫిదా అయిన అల్లు అర‌వింద్‌... ఆయ‌న రెండో సినిమాని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో చేయాల‌ని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ట‌. దీంతో వంశీ రెండో సినిమా కూడా మెగా హీరోల‌తో ఉండే అవ‌కాశం ఉంది. అయితే నిజానికి యంగ్ టైగ‌ర్ ఎన్‌.టీ.ఆర్ తో సినిమా తీయాల‌ని వ‌క్కంతం వంశీ క‌ల‌. తార‌క్ కోస‌మే చాన్నాళ్లు వేచి చూసి... డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో బ‌న్నీతో సినిమా మొద‌లెట్టాడు వంశీ.

ఇప్పుడు రెండో సినిమా కూడా గీతా ఆర్ట్స్ కి రాసిచ్చేస్తే తార‌క్ తో సినిమా కోసం ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే. ఇప్పుడు మెగా హీరోలు కూడా ఎవ్వ‌రూ ఖాళీగా లేరు. చెర్రీ బోయ‌పాటి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి సినిమా చేస్తాడు. కాబ‌ట్టి రెండో సినిమా మొద‌లెట్టాలంటే మ‌నోడు ఇంకో రెండేళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇలా చాలామంది టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు క‌మిట్ మెంట్స్ కార‌ణంగా ఖాళీగా గోర్లు గిల్లుకుంటున్నారు.