Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్' గ్లింప్స్: ప్రభాస్ కి ఇంకా పెళ్ళెందుకు కాలేదు?

By:  Tupaki Desk   |   14 Feb 2022 8:57 AM GMT
రాధేశ్యామ్ గ్లింప్స్: ప్రభాస్ కి ఇంకా పెళ్ళెందుకు కాలేదు?
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనా పరిస్థితుల్లో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

1970ల కాలం వింటేజ్ ప్రేమకథా చిత్రంగా 'రాధేశ్యామ్' రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భాన్ని పురష్కరించుకొని మేకర్స్ స్పెషల్ గ్లిమ్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.

'మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను' అని పూజా హెగ్డే అంటుండగా.. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రేమలో దింపడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలను ఈ గ్లిమ్స్ లో చూడొచ్చు. ఇందులో 'కుక్ చేస్తావ్.. బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు?' అని ప్రభాస్ ను పూజా ప్రశ్నించడం ఆకట్టుకుంటోంది.

వాలెంటైన్స్ డే స్పెషల్ గా 'రాధేశ్యామ్' సినిమా నుంచి వచ్చిన ఈ గ్లిమ్స్ అందరినీ అలరిస్తోంది. ప్రేమకు విధికి మధ్య అతి పెద్ద యుద్ధాన్ని చూపించబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఇందులో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనుందనే సంగతి తెలిసిందే.

ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని మేకర్స్ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇందులో అంతకుమించి ట్విస్టులు ఉన్నట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - మురళీ శర్మ - సచిన్‌ ఖేడ్‌కర్‌ - జయరామ్ - ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు.

'రాధేశ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్‌ - యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. హిందీలో టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ చేసారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది.