Begin typing your search above and press return to search.

ఏకే సినిమాపై పీకే దెబ్బ పడనుందా..?

By:  Tupaki Desk   |   23 Feb 2022 3:30 AM GMT
ఏకే సినిమాపై పీకే దెబ్బ పడనుందా..?
X
2022 ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే పెద్ద సినిమా ఒక్కటీ రాలేదనే చెప్పాలి. 'బంగార్రాజు' లాంటి ఒక సక్సెస్ ఫుల్ చిత్రం వచ్చినప్పటికీ.. అది కొన్ని ఏరియాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులను అలరించడానికి వచ్చే వారం నుంచి మొదలు పెట్టి, సమ్మర్ సీజన్ ఎండింగ్ వరకు భారీ చిత్రాలన్నీ థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి.

ముందుగా మహా శివరాత్రి స్పెషల్ గా ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. ఫిబ్రవరి 24న తమిళ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''వలిమై'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించడంతో తెలుగులోనూ ఈ మూవీకి క్రేజ్ ఏర్పడింది.

ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ''భీమ్లా నాయక్'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్ సినిమా విడుదల అవుతుందంటే.. ఎంతటి హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'వకీల్ సాబ్' తర్వాత అగ్ర హీరో నుంచి రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ నెల 25న సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''గంగుబాయి కతీయవాడి'' సినిమా విడుదల అవుతుంది. అజయ్ దేవగన్ ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పలు భారతీయ భాషలతో పాటుగా తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. గంగుబాయి అనే మహిళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇదే వారంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'గని' 'స్టెబాస్టియన్' వంటి మరో మూడు సినిమాలు రావాలని చూసినా.. 'భీమ్లా నాయక్' చిత్రంతో పోటీని నివారించడానికి వాయిదా వేసుకున్నారు. దీంతో చివరకు టాలీవుడ్ బాక్సాఫీస్ వార్ లో ప్రధానంగా మూడు సినిమాలు నిలిచాయి. అయితే 'గంగుబాయి' పరిస్థితి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో 'వాలిమై' సినిమాపై పవన్ కళ్యాణ్ మూవీ ఎఫెక్ట్ గట్టిగానే పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

'వలిమై' సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్క్రీన్ లలోనే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే తొలి రోజు ఈ చిత్రానికి అధిక థియేటర్లు దొరికినా.. మరుసటి రోజు నుంచి వాటి సంఖ్య గణనీయంగా పడిపోయే చాన్స్ ఉందని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే 'భీమ్లా నాయక్' చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

చాలా మంది ఎగ్జిబిటర్లు రెండో రోజు నుంచి 'వాలిమై' సినిమాను అనధికారికంగా థియేటర్ల నుండి తొలగించాలని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఏపీలో మూడు రోజుల పాటు ప్రతీ స్క్రీన్ లోనూ 'భీమ్లా నాయక్' మూవీని రన్ చేయాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమైతే అజిత్ సినిమాకు రిలీజ్ నెక్స్ట్ డే నుంచి పెద్ద దెబ్బ పడినట్లే. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. మరోవైపు 'వలిమై' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.