Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'వలిమై'

By:  Tupaki Desk   |   24 Feb 2022 8:00 AM GMT
మూవీ రివ్యూ : వలిమై
X
చిత్రం : 'వలిమై'

నటీనటులు: అజిత్ కుమార్-కార్తికేయ-హ్యూమా ఖురేషి-రాజ్ అయ్యప్ప-సుమిత్ర-అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
నేపథ్య సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: నిరవ్ షా
నిర్మాత: బోనీ కపూర్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హెచ్.వినోద్

తమిళంలో పెద్ద స్టార్ అయిన అజిత్ ప్రధాన పాత్రలో.. మన తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించిన సినిమా ‘వలిమై’. ఇదే పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (అజిత్) విజయవాడ నుంచి విశాఖపట్నానికి బదిలీ చేయించుకుని వచ్చిన పోలీస్ ఆఫీసర్. అతను ఈ సిటీలో అడుగు పెట్టేసరికి అక్కడ తరచూ బంగారు గొలుసుల దొంగతనాలు.. హత్యలు జరుగుతుంటాయి. అంతే కాక సిటీ అంతా కుర్రాళ్లు మాదక ద్రవ్యాల మత్తులో మునిగి తేలుతుంటారు. ఈ నేరాలు వేటికవే వేరుగా కనిపిస్తాయి కానీ.. వీటి వెనుక ఉన్నది ఒకటే గ్యాంగ్ అని.. దాని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని అర్జున్ కనిపెడతాడు. దీంతో ఈ గ్యాంగుని పట్టుకుని బాధ్యతను పోలీసు ఉన్నతాధికారులు అర్జున్ కే అప్పగిస్తారు. ఇంతకీ ఈ నెట్ వర్క్ మొత్తాన్ని నడిపిస్తున్నది ఎవరు.. అతణ్ని పట్టుకోవడానికి అర్జున్ ఏం చేశాడు.. వీరి మధ్య పోరు ఎలా సాగింది.. చివరికి ఎవరు గెలిచారు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

వలిమై.. అంటే అర్థమేంటో మన జనాలకు తెలియదు. సినిమాలో కూడా ఈ పదానికి ఎక్కడా అర్థం చెప్పరు. ఇదేమీ హీరో పేరు కాదు. లేదా ఏదైనా ప్రాంతం పేరా అంటే అదీ కాదు. వలిమై అంటే.. శక్తి అని అర్థమని వికీపీడియా చూస్తే తెలుస్తుంది. తెలుగులో అదే పేరో.. లేదా దానికి సమాన అర్థమున్న ఇంకో పేరో పెట్టడానికి కూడా చిత్ర బృందానికి కష్టమైపోయింది. తెలుగు వాళ్లు ఏం తీసినా చూసేస్తారు.. ఏం పేరు పెట్టినా పట్టించుకోరు అన్న ధీమాతో ఈ సినిమాను తమిళ పేరుతోనే రిలీజ్ చేసినట్లున్నారు. కానీ తమిళం నుంచి ఏ సినిమా వచ్చినా వెళ్లి గుడ్డిగా థియేటర్లకు వెళ్లిపోయి ఆహా ఓహో అనే పరిస్థితుల్లో మన ప్రేక్షకులకు ఇప్పుడు ఎంతమాత్రం లేరు. మన సినిమాలు మూసలో సాగిపోతూ.. తమిళ చిత్రాలు చాలా కొత్తగా అనిపించిన రోజుల్లో ఇదంతా చెల్లింది. కానీ ఇప్పుడు మన సినిమాల ముందు తమిళ చిత్రాలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు చూసిన రొటీన్ కథలకు ‘యాక్షన్’ మేకప్ వేసి దించుతుంటే తమిళ ప్రేక్షకులు ఎగబడి చూసేస్తున్నారు కానీ.. మన ప్రేక్షకులకు అవి రుచించట్లేదు. పోయిన దీపావళికి మన వాళ్లు ఇదేం సినిమారా బాబోయ్ అని తలలు పట్టుకున్న రజినీకాంత్ సినిమా ‘అన్నాత్తె’కు కూడా తమిళ ప్రేక్షకులకు మంచి వసూళ్లు అందించారంటే వాళ్ల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల ప్రస్తుత అభిరుచికి తగ్గట్లే కేవలం హీరో ఎలివేషన్లు.. భారీ యాక్షన్ ఘట్టాలు.. సెంటిమెంటును రంగరించి ‘ఖాకి’ దర్శకుడు హెచ్.వినోద్ అందించిన రొటీన్ సినిమా ‘వలిమై’.

అజిత్ చాలా ఏళ్ల నుంచి చేస్తున్నవి రొటీన్ యాక్షన్ సినిమాలే. అతడితో పని చేసే దర్శకులంతా హీరో ఎలివేషన్లు.. యాక్షన్.. ఇలా అభిమానులు.. మాస్ ప్రేక్షకులు కనెక్టయ్యే అంశాలు ప్రధానంగానే సినిమాలు తీస్తున్నారు. ఐతే శతురంగ వేట్టై, ఖాకి చిత్రాలతో మెస్మరైజ్ చేసిన వినోద్ దర్శకత్వంలో అజిత్ సినిమా అనగానే ఇందులో కథాకథనాలు కొత్తగా ఉంటాయని.. అజిత్ చేసే మసాలా చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుందని అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ విలన్ పాత్ర తాలూకు నేపథ్యం.. అతడి నడిపే క్రైమ్ రాకెట్ వరకు కొత్తగా అనిపిస్తుంది తప్పితే.. కథగా చూస్తే ‘వలిమై’లో ఏ కొత్తదనం కనిపించదు. ఏ కేసైనా చిటికెలో పరిష్కరించేసే పోలీసాఫీసర్ గా హీరో.. అవతలేమో పోలీసులకు సవాలుగా మారిన ఒక క్రైమ్ రాకెట్.. దాన్ని నడిపించే విలన్.. హీరో రంగంలోకి దిగాక.. ఇద్దరి మధ్య నువ్వా నేనా అంటూ సాగే పోరు.. చివరికి విలన్ మీద హీరో పైచేయి.. ఇలా ఎన్నో సినిమాల్లో చూసిన టెంప్లేట్లో ‘వలిమై’ కూడా నడుస్తుంది. కాకపోతే ఇందులో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేది విలన్ నడిపే క్రైమ్ నెట్ వర్క్ నేపథ్యం.. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు.

వలిమై దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమా. ఇందులో సగానికి పైగా సమయం యాక్షన్ ఘట్టాలతోనే సాగిపోతుంది. యాక్షన్ అంటే మామూలు యాక్షన్ కాదు. ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా.. ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు చూడని స్థాయిలో ఇందులో యాక్షన్ సీక్వెన్స్ సాగుతాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రేసింగ్ బైకర్స్ విన్యాసాలతో సాగే యాక్షన్ ఘట్టాలైతే నోరెళ్లబెట్టి చూసేలా ఉంటాయి. స్వయంగా అజిత్ మోటార్ బైక్ రేసర్ కావడంతో ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకుంటూ దర్శకుడు.. యాక్షన్ కొరియోగ్రాఫర్.. సినిమాటోగ్రాఫర్ కలిసి ఈ ఘట్టాల్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రథమార్ధంలో.. అలాగే ద్వితీయార్ధంలో సుదీర్ఘంగా సాగే రెండు యాక్షన్ బ్లాక్స్ వారెవా అనిపిస్తాయి. ఊపిరి బిగబట్టి చూసేలా వీటిని తీర్చిదిద్దిన తీరుకు కచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఇక విలన్ తానెవరో బయటికి కనిపించకుండా.. ఉద్యోగం లేక అసహనంతో ఉన్న కుర్రాళ్లను టార్గెట్ చేసి వాళ్లను ఒక నెట్ వర్క్ తో కలిపి నేరాలకు పాల్పడేలా చేసే సెటప్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆరంభంలో ప్రేక్షకులను సినిమాలో బాగా ఇన్వాల్వ్ చేసేలా చేస్తుందీ ఎపిసోడ్. దీంతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. కొత్తగా అనిపిస్తాయి. ‘ఖాకి’ దర్శకుడి ముద్ర కనిపించేది ఈ సన్నివేశాల్లోనే.

ఐతే ఆసక్తికర నేపథ్యంతో సినిమాను ఆరంభించి.. ఆ తర్వాత హీరో రంగ ప్రవేశంతో సాధారణంగా మార్చేశాడు వినోద్. హీరోకు ఎలివేషన్ ఇవ్వడం కోసం.. మిగతా పోలీసులందరినీ దద్దమ్మల్లా చూపించి.. హీరో రంగంలోకి దిగగానే నిమిషాల్లో ఈ క్రైమ్ నెట్ వర్క్ గుట్టు రాబట్టేయడం చూస్తే విడ్డూరంగా అనిపిస్తుంది. అజిత్ స్టార్ ఇమేజ్ మాయలో పడి ఇక్కడ గాడి తప్పిన దర్శకుడు.. సినిమా అంతటా కూడా ఇలాగే రాజీ పడిపోయాడు. ఈ క్రైమ్ నెట్ వర్క్ కు సంబంధించిన సన్నివేశాలకు తోడు.. పేలిపోయే యాక్షన్ ఘట్టంతో ప్రథమార్ధం వరకు ‘వలిమై’ ఓకే అనిపించినా.. ద్వితీయార్ధంలో మాత్రం నిరాశకు గురి చేస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంటును పండించే క్రమంలో మెలోడ్రామా ఎక్కువైపోయి సినిమా గాడి తప్పేసింది. విలన్ని కోర్టులో హాజరు పరిచేందుకు వెళ్తున్న హీరో మీద విలన్ గ్యాంగ్ ఎటాక్ చేసే ఎపిసోడ్ ఒక్కటి బాగా హైలైట్ అయినా.. ద్వితీయార్ధంలో దీన్ని మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోను దెబ్బ కొట్టడానికి విలన్ అతడి ఫ్యామిలీని టార్గెట్ చేయడం.. హీరోకు ఎదురు దెబ్బ తగలడం.. సస్పెన్షన్ వేటు పడటం.. తిరిగి అతను పుంజుకుని విలన్ని దెబ్బ తీయడం.. ఇదంతా చాలా రొటీన్ గా సాగిపోతుంది. ద్వితీయార్ధంలో ఒక దశ తర్వాత సెంటిమెంట్.. యాక్షన్ డోస్ ఎక్కువైపోయి ఇక సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడటం ప్రేక్షకుల వంతవుతుంది. నిడివి మరీ మూడు గంటలుండటం ప్రేక్షకుల సహనానికి పరీక్షే. అజిత్ ఏం చేసినా ఆహా ఓహో అనే తమిళ ప్రేక్షకులకు ‘వలిమై’ గొప్పగా అనిపించొచ్చేమో కానీ.. ఆరంభ సన్నివేశాలు.. యాక్షన్ ఘట్టాల్ని మినహాయిస్తే మన వాళ్లు కనెక్టయ్యే అంశాలు ఇందులో తక్కువే.

నటీనటులు:

అజిత్ లుక్స్ పరంగా చాలా యావరేజ్ గా అనిపిస్తాడు. అతనో పోలీసాఫీసర్ అంటే నమ్మశక్యంగా అనిపించదు. బయట పోలీసాఫీసర్లు ఎలా కనిపించినా.. తెరపై స్టార్ హీరోలు ఈ పాత్రల్ని చేసినపుడు ఫిజిక్ తో మెప్పించేలా ఉండాలని ఆశిస్తాం. కానీ అజిత్ అలా లేడు. అతడి అప్పీయరెన్స్ కు.. తెరపై చేసే యాక్షన్ విన్యాసాలకు పొంతన కుదర్లేదు. నటన పరంగా అజిత్ ఓకే అనిపించాడు. మరీ భావోద్వేగాలు పండించాల్సిన పాత్రేమీ కాదిది. హ్యూమా ఖురేషి స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకుంది. ఐతే ఆమెను నార్కోటిక్స్ నిపుణులురాలిగా చూపించి.. తనతో రకరకాల పనులు చేయించేస్తారు సినిమాలో. హీరోను కూడా ముందు డిప్యూటీ కమిషనర్ గా చూపించి.. తర్వాత ఇన్ స్పెక్టర్ గా డిమోట్ చేయడమేంటో అర్థం కాదు. విలన్ పాత్రలో కార్తికేయ మెరిశాడు. తనకు దక్కిన అవకాశాన్ని అతను పూర్తిగా ఉపయోగించుకుున్నాడు. కార్తికేయ ఫిజిక్.. బాడీ లాంగ్వేజ్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల అజిత్ ను మించి అతను హైలైట్ అయ్యాడు. హీరో తమ్ముడిగా చేసిన రాజ్ అయ్యప్ప ఆకట్టుకున్నాడు. సీనియర్ నటి సుమిత్ర నటన ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘వలిమై’ టాప్ క్లాస్ అనిపిస్తుంది. నిరవ్ షా ఛాయాగ్రహణం.. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాలో మేజర్ హైలైట్స్. దర్శకుడితో కలిసి వాళ్లు పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. కొన్ని స్టంట్లను ఎలా కంపోజ్ చేశారో.. ఎలా చిత్రీకరించారో అని ఆశ్చర్యపోయేలా ఈ ముగ్గురూ శ్రమించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఘట్టాల్లో.. ఎలివేషన్ సీన్లలో ఆర్ఆర్ ఉత్తేజభరితంగా సాగింది. యువన్ శంకర్ రాజా పాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. బోనీకపూర్ ఏమాత్రం రాజీ పడలేదు. ఇక దర్శకుడు వినోద్ విషయానికి వస్తే.. విలన్ పాత్ర.. అతను నడిపే క్రైమ్ నెట్ వర్క్ కు సంబంధించిన నెట్ వర్క్ విషయంలో అతను తన ముద్రను చూపించాడు. శతురంగ వేట్టై.. ఖాకి చిత్రాల్లో మాదిరి ఈ సెటప్ వరకు అతను ఎంతో కసరత్తు చేసిన విషయం అర్థమవుతుంది. కానీ ఒక దశ దాటాక హీరో ఇమేజ్ తాలూకు ఛట్రంలో పడిపోయి అతను ఈ కథను రొటీన్ టెంప్లేట్లోకి మార్చేశాడు. క్రమ క్రమంగా దర్శకుడిగా వినోద్ తన శైలికి దూరమయ్యాడు. కథనంపై పట్టు కోల్పోయాడు.

చివరగా: వలిమై.. విషయం తక్కువ.. యాక్షన్ ఎక్కువ

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre