Begin typing your search above and press return to search.

మచ్చల కోసం వెతికితే కష్టం మాష్టారూ!!

By:  Tupaki Desk   |   28 Aug 2015 6:09 PM GMT
మచ్చల కోసం వెతికితే కష్టం మాష్టారూ!!
X
దర్శకుల్లో సీనియర్‌ వంశీ అనగానే ముందుగా గుర్తుకొచ్చే సినిమా లేడీస్‌ టైలర్‌. రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌. కామెడీ సినిమాల జోనర్‌ లో ఇదో కొత్త అధ్యాయం సృష్టించిన సినిమా. వంశీ స్వతహా గోదారి వాసి కాబట్టి ఆ నుడికారం, భాష, యాస తన క్యారెక్టర్ లలో హైలైట్‌ అవుతుంది. అది బోలెడంత కామెడీ పుట్టిస్తుంది. గోదారి పల్లె టూళ్లలో సహజసిద్ధమైన సౌందర్యాన్ని, ప్రజల వ్యవహారికాన్ని లేడీస్‌ టైలర్‌ లో చాలా అందంగా చూపించాడు.

ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నాడు వంశీ. చాలా కాలంగా స్క్రిప్టు కోసం కసరత్తులు చేస్తున్న వంశీ లో కాస్త క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. అయితే వంశీ మాత్రం ఓ సంగతిని గుర్తుంచుకోవాలి. లేడీస్‌ టైలర్‌ అప్పటి నేటివిటీకి, కాలానికి సరిపోయింది. కానీ ఇప్పుడు దీనికి సీక్వెల్‌ తీయాలంటే చాలానే ఆలోచించాలి. ఆ సినిమాలో హైలైట్‌ అయిన మచ్చ కాన్సెప్టును మరోసారి తెరపైకి తెస్తానంటే కుదరదు.

ఫలానా అమ్మాయి తొడ మీద కుంకుడు కాయంత మచ్చ ఉంటుంది. ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి. వెతుక్కో పో! అని హీరోని ఉసిగొలుపుతానంటే కష్టం. ఎందుకంటే మారిన సమాజంలో మహిళా మండళ్లు కయ్యానికి రెడీగా ఉన్నాయి. ఆడాళ్లను చూపించే పద్ధతిలో మరీ అంత న్యూడిటీకి వెళతానంటే కుదరదు. సెన్సార్‌ కంటే పవర్‌ ఫుల్‌ ఇప్పుడు మహిళా అసోసియేషన్లు. కాస్త జాగర్త గురూ. అంతేకాక.. ఈ వాట్సాప్‌, ఫేస్‌ బుక్ రోజుల్లో మచ్చ కోసం పాకులాడే బాబులూ ఎవరుంటారులేండి.