Begin typing your search above and press return to search.

వాణీ విశ్వనాథ్ పెళ్లి అలా జరిగిందట

By:  Tupaki Desk   |   20 March 2017 4:11 AM GMT
వాణీ విశ్వనాథ్ పెళ్లి అలా జరిగిందట
X
వాణీ విశ్వనాథ్.. 90ల్లో తెలుగు సినిమాల్ని ఫాలో అయిన వాళ్లెవ్వరూ కూడా ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. ‘ఘరానా మొగుడు’లో వాన పాటతో ఆమెకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. దాంతో పాటుగా హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాలే చేసింది. కథనాయికగా కొంచెం బిజీగా ఉన్న టైంలోనే బాబూ రాజ్ అనే మలయాళ నిర్మాత కమ్ విలన్ని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ వాణి.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ఈమె పేరు వార్తల్లోకి వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న వాణి.. తన పునరాగమనం గురించి.. తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పింది. ‘‘నేను స్వతహాగా మలయాళ అమ్మాయినైనా నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. టీవీల్లో తెలుగు సినిమాలు చూస్తూ ఉంటాను. ఒకసారి ‘సింహా’ సినిమా చూస్తుంటే.. ఈ డైరెక్టర్ ఎవర్రా బాబూ మాస్ ఎలిమెంట్స్ ను భలేగా ఎలివేట్ చేస్తున్నాడు అనుకున్నా. ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నా. ఆశ్చర్యకరంగా తెలుగులో నా రీఎంట్రీ బోయపాటి శ్రీను ద్వారానే జరుగుతోంది. నేను చేస్తున్న సినిమాలో నాది కీలక పాత్ర. పెళ్లి తర్వాత నేను ఇటువైపు చూడలేదు. నా పెళ్లి భలే చిత్రంగా జరిగింది. బాబూరాజ్ అనే మలయాళ నిర్మాతనే పెళ్లి చేసుకున్నా. ఆయన సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా మేం అంత్యాక్షరి ఆడాం. ఆ సందర్భంగా ఒక పాట చరణం పాడబోతూ.. దీని పల్లవి ఏదో చెబితే మీరు ఏం అడిగినా చేస్తానన్నాను. విలన్ కదా.. పాటల మీద ఏం అవగాహన ఉంటుందిలే అనుకున్నా. కానీ నేను చరణం మొదలుపెట్టగానే.. ఆయన పల్లవి అందుకున్నారు. ఏం కావాలని అడిగితే.. తర్వాత చెబుతానన్నారు. కొన్నాళ్లకు నాకు మీరొకటి బాకీ ఉన్నారంటూ.. పెళ్లి చేసుకోమని అడిగారు. కొన్నాళ్లు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాక నేను కూడా పెళ్లికి ఓకే చెప్పేశా. మాకిప్పుడు ఇద్దరు పిల్లలు’’ అని వాణి తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/