Begin typing your search above and press return to search.

మేకోవర్ లో మెరుపుతీగలు!

By:  Tupaki Desk   |   28 Aug 2022 1:03 PM GMT
మేకోవర్ లో మెరుపుతీగలు!
X
గతంలో పాత్రకి తగినట్టుగా కనిపించడానికి హీరోలు మాత్రమే కష్టపడి కసరత్తులు చేయవలసి ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరోయిన్లు గ్లామర్ కి మించిన విన్యాసాలు చేయవలసి వస్తోంది. అందుకు అవసరమైన మేకోవర్ తో తమని తాము మార్చుకోవడానికీ .. మలచుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. కర్రసాము .. కత్తిసాములు మాత్రమే నేర్చుకుంటే చాలనుకునే రోజులు కావు ఇవి. రిస్కీ ఫైట్స్ చేయడానికి సైతం హీరోయిన్లు సిద్ధపడుతున్నారు. అందుకు అవసరమైన ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నారు.

సమంత విషయానికే వస్తే .. సన్నజాజితీగలాంటి ఈ భామ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. రోజు మొత్తంలో ఎక్కువ సమయం ఆమె ఈ సాధనలోనే ఉంటోంది. హిందీలో ఆమె 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె ఫైట్లు గట్రా ఒక రేంజ్ లో చేస్తుందట. అందువలన మార్షల్ ఆర్ట్స్ పై మనసు పెట్టిందని అంటున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు.

సమంత తాజా చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'యశోదా' .. 'శాకుంతలం' రెడీ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ సరసన నాయికగా చేస్తున్న 'ఖుషి' సెట్స్ పై ఉంది. ఇక ముద్దుగా .. బొద్దుగా ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేశ్ ఆ మధ్య 'మిస్ ఇండియా' సినిమా కోసం సన్నబడింది. అలాంటి ఆమె ఇప్పుడు కాస్త బరువు పెరుగుతోంది .. అదీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం. స్టార్ హీరోల సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఆంటోని భాగ్యరాజ్ ఒక యాక్షన్ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమా కోసం బరువు పెరగడానికి కీర్తి సురేశ్ గట్టిగానే కష్టపడుతోందట.

ఇక విలన్ పాత్రలతో చెలరేగిపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ నాజూకుగా మారిపోయి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. మళ్లీ హీరోయిన్ గా చేస్తుందా ఏంటి? అనే డౌట్ రాకపోదు. ఇంత స్లిమ్ గా మారడానికి తనకి నాలుగు నెలల సమయం పట్టిందని వరలక్ష్మి శరత్ కుమార్ చెబుతోంది. ఏదో సినిమాలో ప్రధానమైన పాత్ర కోసమే ఆమె ఈ రేంజ్ లో వర్కౌట్స్ చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. తెలుగులో మూడు .. తమిళంలో మూడు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. బొద్దుగా ఉండే ఈ భామలంతా మేకోవర్ తో మెరుపుతీగల్లా మారిపోతుంటే చూడటానికి ముచ్చటగానే ఉంటుంది మరి.