Begin typing your search above and press return to search.

ఇది స్టార్‌ హీరోల బాధ్యతారాహిత్యం : వరలక్ష్మి

By:  Tupaki Desk   |   17 March 2019 8:16 AM GMT
ఇది స్టార్‌ హీరోల బాధ్యతారాహిత్యం : వరలక్ష్మి
X
తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి మాట్లాడితే ఈమద్య కాలంలో సంచలనం అవుతోంది. ముఖ్యంగా ఈమె ఏ విషయం గురించి మాట్లాడినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూనే విలన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించే సాహసం చేసిన వరలక్ష్మి రాజకీయల వైపు కూడా ఆసక్తికరంగా చూస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. ఈమె తండ్రి శరత్‌ కుమార్‌ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీలో జాయిన్‌ అవ్వబోను అంటూ ప్రకటించిన వరలక్ష్మి రాజకీయాల ఎంట్రీకి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

మీటూ, కాస్టింగ్‌ కౌచ్‌ ఇంకా ఆడవారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గలమెత్తిన వరలక్ష్మి కొన్ని రోజుల క్రితం స్త్రీల కోసం సేవ్‌ శక్తి అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఆ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఈమె నిర్వహిస్తూ వస్తోంది. ఇటీవల తమిళనాడు పొల్లాచ్చిలో అత్యాచార సంఘటనపై ఆమె తీవ్ర స్థాయిలో గళం విప్పింది. ప్రభుత్వం వెంటనే ఘటనకు బాధ్యులు అయిన వారిని శిక్షించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తోంది.

తాజాగా పొల్లాచ్చి ఘటనపై ఒక కార్యక్రమంలో పాల్గొన్న వరలక్ష్మి కోలీవుడ్‌ స్టార్‌ హీరోలను టార్గెట్‌ చేసింది. తమిళ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు పొల్లాచ్చి ఘటనపై స్పందించలేదు. స్టార్స్‌ స్పందన చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో స్టార్స్‌ స్పందిస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. మరి ఎందుకు వారు పొల్లాచ్చి సంఘటనపై స్పందించడం లేదో అర్థం కావడం లేదు అంటూ వరలక్ష్మి అంది. ఇలాంటి దారుణాల గురించి స్టార్స్‌ స్పందించక పోవడం వారి బాధ్యతారాహిత్యం అవుతుందని ఈ సందర్బంగా వరలక్ష్మి చెప్పుకొచ్చింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు పలువురు ఈ విషయంపై స్పందించలేదు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తామని చెబుతున్న వారు కూడా పొల్లాచ్చి ఘటనపై స్పందించలేదు. అందుకే వరలక్ష్మి ఇలాంటి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.