Begin typing your search above and press return to search.

'వారసుడు' స్టిల్స్: 'మహర్షి' ని రీమేక్ చేయడం లేదు కదా వంశీ..?

By:  Tupaki Desk   |   27 Oct 2022 2:37 AM GMT
వారసుడు స్టిల్స్: మహర్షి ని రీమేక్ చేయడం లేదు కదా వంశీ..?
X
కోలీవుడ్ స్టార్ హీరో, తలపతి విజయ్ మరియు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''వారసుడు''. తమిళ్ లో 'వారిసు' అనే పేరుతో వస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే 'వారసుడు' సినిమా నుంచి వచ్చిన విజయ్ కు సంబంధించిన మూడు లుక్స్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరో.. ఈసారి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని సూచించాయి. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్ ని తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు.

'వారసుడు' నుంచి విజయ్ సరికొత్త స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోస్టర్స్ చూసిన నెటిజన్లు 'మహర్షి' సినిమాతో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో మహేష్ స్టూడెంట్ మరియు కంపెనీ సీఈఓగా లుక్స్ పరంగా వేరియేషన్ చూపించారు.

ఇప్పుడు 'వారసుడు' సినిమాలనూ విజయ్ సూటూ బూటూ వేసి బిజినెస్ మ్యాన్ గా ఉబర్ కూల్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ స్టిల్స్ చూస్తుంటే 'మహర్షి' లో మహేశ్ గుర్తుకు రాకమానదు. కాస్ట్యూమ్స్ - చేతిలో టీ గ్లాస్ తో సహా ప్రతీ అంశం ఆ సినిమాతో కంపేర్ చేసేలా ఉంది. జయసుధ - విజయ్ కలిసి ఉన్న స్టైల్ కూడా అక్కడ మహేష్ - జయసుధ ఉన్న ఫ్రేమ్ ని గుర్తు చేస్తోంది.

'మహర్షి' కి ప్రతిరూపంగా కనిపిస్తున్న ఈ స్టిల్స్ చూస్తుంటే.. వంశీ 'మహర్షి' రీమేక్ గా ''వారసుడు' చిత్రాన్ని తీయడం లేదా కదా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇది 'మహర్షి' సీక్వెల్ అయ్యుండొచ్చని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి 'ది బాస్ రిటర్న్స్' అంటూ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే ఈ పోలికలు మొదలయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ స్టిల్స్ చూసి 'మహర్షి 2' అంటూ విమర్శిస్తున్నారు. విజయ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు.. టెంప్లేట్ ఎలా ఉన్నా కాస్ట్యూమ్స్ వంటి విషయాలలో అయినా జాగ్రత్త తీసుకోవాల్సిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ''వారసుడు'' సినిమా 'లార్గో విచ్' అనే ఫ్రెంచ్ సినిమా ఫ్రీమేక్స్ గా ముద్రపడిన 'అజ్ఞాతవాసి' మరియు 'సాహో' వంటి చిత్రాలకు దగ్గరగా ఉండే కథాంశంతో రూపొందుతోందని రూమర్స్ వస్తున్నాయి. వంశీ పైడిపల్లితో పాటు హరి - అహిషోర్ సాల్మన్ కలిసి ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు.

తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 'వారిసు' తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమానా కదా? అని ప్రశ్నించగా.. ఇది పూర్తిగా తమిళ చిత్రమని దర్శకుడు స్పష్టం చేసారు. కాబట్టి, ఈ చిత్రాన్ని 'వారసుడు' గా తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఏదేమైనా 'మహర్షి' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసి కూడా ట్రోలింగ్ ఎదుర్కొన్న వంశీ.. ఇప్పుడు 'వారసుడు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోడానికి చాలా కష్టపడుతున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు - శరత్ కుమార్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - శ్రీకాంత్ - కిక్ శామ్ - యోగి బాబు - సంగీత - సంయుక్త షణ్ముగం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పీవీపీ సినిమాస్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 2023 పొంగల్ కానుకగా 'వారసుడు' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.