Begin typing your search above and press return to search.

మళ్లీ ఫిదా చేస్తానంటున్న వరుణ్!!

By:  Tupaki Desk   |   1 Aug 2017 4:17 PM IST
మళ్లీ ఫిదా చేస్తానంటున్న వరుణ్!!
X
మెగా హీరో ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు కమర్షియల్ సక్సెస్ అందుకునేందుకు చాలా కాలమే పట్టింది. డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటాడనే జనాల గుర్తింపునకు.. డబ్బులు తెచ్చే సినిమాలు చేస్తాడనే డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని జోడించడానికి చాలా కాలమే పట్టింది.

ఫిదా చిత్రంతో ఆడియన్స్ ను ఫిదా చేశాడు వరుణ్ తేజ్. ఈ మూవీ సక్సెస్ లో చాలావరకు క్రెడిట్ ను హీరోయిన్ సాయిపల్లవి.. దర్శకుడు శేఖర్ కమ్ముల పట్టుకెళ్లినా.. మెగా హీరో కావడంతోనే ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమయ్యాయని అనడంలో సందేహం అక్కర్లేదు. అలా ఓ పల్లెటూరి ప్రేమకథతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరీకే మొగ్గుతుండడం విశేషం. వెంకీ అట్లూరి డైరెక్షన్ రూపొందనున్న ఓ ప్రేమకథలో నటించనున్న వరుణ్ తేజ్.. ఇలా వరుసగా రెండో లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం వెనక రీజన్ చెప్పాడు.

'మళ్లీ నేను ప్రేమకథలోనే నటించడానికి నిర్ణయించుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. వెంకీ అట్లూరి మూవీ ప్రేమ కథే అయినా.. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫిదాకు ఎలా శేఖర్ కమ్ముల టచ్ కీలకమో.. వెంకీ అట్లూరి సినిమాకు కూడా అంతే' అంటూ తన మరుసటి మూవీ కబుర్లు చెబుతున్నాడు వరుణ్ తేజ్.