Begin typing your search above and press return to search.

‘తొలి ప్రేమ’పై పడ్డారా ఏంటి?

By:  Tupaki Desk   |   2 Sep 2017 7:55 AM GMT
‘తొలి ప్రేమ’పై పడ్డారా ఏంటి?
X
మెగా యంగ్ హీరోల దృష్టి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీ ‘తొలి ప్రేమ’ మీద పడ్డట్లున్నాయి. ఇప్పటికే పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘తొలి ప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ డైరెక్షన్లో ‘తొలి ప్రేమ’ లైన్స్ లోనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తేజు ‘తొలి ప్రేమ’ పవన్ లాగే కనిపిస్తాడట. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పవన్ ను అనుకరించడంలో దిట్ట అని నిరూపించుకున్న తేజు.. ఇక పవన్ క్లాసిక్ మూవీ స్టయిల్లో సినిమా అంటే.. మావయ్యను దించేస్తాడనడంలో సందేహం లేదు.

మరో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ సైతం ‘తొలి ప్రేమ’ను చూసి స్ఫూర్తి పొందుతుండటం విశేషం. యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ‘తొలి ప్రేమ’ స్టయిల్లోనే సాగుతుందట. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి ‘తొలి ప్రేమ’ అనే టైటిలే పెట్టాలని భావిస్తున్నట్లు తాజా కబురు బయటికి వచ్చింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పేరును ప్రకటిస్తూ త్వరలోనే ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారట. ‘స్నేహగీతం’.. ‘జ్నాపకం’ లాంటి సినిమాల్లో నటించిన వెంకీ.. దర్శకుడిగా మారడానికి చాన్నాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు వరుణ్ హీరోగా సినిమా చేసే అవకాశం లభించింది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు.