Begin typing your search above and press return to search.

1942 ఏప్రిల్ 6న వైజాగ్ లో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   10 Sep 2015 8:12 AM GMT
1942 ఏప్రిల్ 6న వైజాగ్ లో ఏం జరిగింది?
X
73 ఏళ్ల కిందట వైజాగ్ లో ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. అతనలా అడగడానికి కారణం లేకపోలేదు. అప్పటి నేపథ్యంతో ‘కంచె’ అనే సినిమా చేస్తున్నాడతను. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో అతను చేస్తున్న లవ్ స్టోరీ ‘కంచె’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తన ట్విట్టర్ ఫాలోయర్లకు ఓ జనరల్ నాలడ్జ్ క్వశ్చన్ వేశాడు వరుణ్. ‘‘1942 ఏప్రిల్ 6న విశాఖపట్నంలో ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా?’’ అని అడిగాడు వరుణ్. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఆ తేదీ కున్న ప్రాధాన్యమేంటి? తెలుసుకుందాం పదండి.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మన సముద్ర తీరంలోనూ దాడులు జరిగిన సంగతి చాలామందికి తెలియదు. 1942 ఏప్రిల్ 6న విశాఖపట్నం పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. ఆ రోజు జపాన్, అమెరికా యుద్ధ సేనల మధ్య వైరం మన నగరానికి ముప్పు తెచ్చింది. బంగాళా ఖాతం మీదుగా జపాన్ కు చెందిన నౌకలు విశాఖ సముద్ర తీరం సమీపంలో ప్రయాణం సాగిస్తుండగా అమెరికా యుద్ధ నౌకలతో యుద్ధం జరిగింది. సముద్ర గర్భంలోని యుద్ధ నౌకల్ని నాశనం చేసేందుకు పై నుంచి బాంబుల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విశాఖ పోర్టు ఏరియాలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే నాలుగు బాంబుల అనంతరం చివరగా వేసిన బాంబు అదృష్టవశాత్తూ పేలలేదు. ఆ బాంబు సముద్ర గర్భంలోని యుద్ధ నౌకకు తాకి అది పేలి ఉంటే విశాఖ నగరం రూపురేఖలే ఉండేవి కావు. ఎందుకంటే అందులో 2 వేల టన్నుల పేలుడు సామాగ్రి ఉంది. అవి పేలి ఉంటే పెరల్ హార్బర్-2 చూడాల్సి వచ్చేది. నగరమే తుడిచిపెట్టకుపోయేదేమో.

‘కంచె’ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి.. ఈ సంగతులన్నీ తెలుసుకున్నట్లున్నాడు వరుణ్. అందుకే తన ట్విట్టర్ ఫాలోయర్ల జీకేని పరీక్షించే ప్రయత్నం చేశాడు. బహుశా సినిమాలో వైజాగ్ బాంబు దాడుల ప్రస్తావన ఉండి ఉండొచ్చు.