Begin typing your search above and press return to search.

వరుణ్ అంత కష్టపడ్డాడు మరి

By:  Tupaki Desk   |   2 Sep 2015 1:31 PM GMT
వరుణ్ అంత కష్టపడ్డాడు మరి
X
ఫిబ్రవరిలో మొదలయ్యింది 'కంచె' సినిమా. కానీ ఆరు నెలల లోపే సినిమా పూర్తయిపోయింది. ఐతే ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే.. ఇలాంటి సినిమా ఇంత తక్కువ టైంలో ఎలా పూర్తి చేశారో అని సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి పీరియాడిక్ సినిమాలు తీయడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. భారీ బడ్జెట్, చాలా శ్రమ అవసరమవుతుంది. మరి ఆరు నెలల్లో సినిమా పూర్తి చేయాలంటే క్రిష్, వరుణ్ తేజ్ అండ్ టీమ్ ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఈ సంగతే వరుణ్ దగ్గర ప్రస్తావిస్తే తన కష్టం గురించి వివరించాడు. 'కంచె' సినిమాకు అందరికంటే ఎక్కువ కష్టపడింది డైరెక్టరే అని.. ఎంతో పరిశోధన, పరిశీలన, రిహార్సల్స్ తర్వాతే క్రిష్ ఈ సినిమాకు పూనుకున్నాడని చెప్పాడు.

''ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సినిమా అంటే మాటలు కాదు. క్రిష్ అప్పటి కాలానికి సంబంధించి చాలా పరిశోధన చేశాడు. చాలామందిని కలిశాడు. ఓ మాజీ మిలటరీ అధికారిని కలిసి షూటింగ్ కోసం ఆయన సహకారం తీసుకున్నాడు. ఆయన్ని తీసుకొచ్చి మాకు ట్రైనింగ్ ఇప్పించాడు. ఓ సైనికుడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. అతను యుద్ధంలో ఎలా స్పందిస్తాడు.. ఎలా పోరాడతాడో.. అతడి కమిట్మెంట్, ఎమోషన్ ఎలా ఉంటుందని ఆయనే నేర్పించారు. షూటింగ్ కోసం జార్జియా వెళ్లడానికి ముందు మూడు వారాల్లో చాలా శ్రమించాం. బూట్ క్యాంపులో పాల్గొన్నాం. ఒళ్లు హూనమయ్యేలా కష్టపడ్డాం. రన్నింగ్, జంపింగులతో సన్నద్ధమయ్యాం. జార్జియాలో భారీ సెట్ల మధ్య వందలమంది స్థానిక ఆర్టిస్టులతో కలిసి షూటింగ్ చేశాం.

షూటింగులో నిజంగానే ప్రపంచ యుద్ధంలో వాడిన టామీ గన్ ను నేను ఉపయోగించాను. అది పట్టుకున్నపుడు అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. జార్జియాలో సూర్యాస్తమయం రాత్రి 9 గంటలకు అవుతుంది. మేం ఉదయం 6 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు షూటింగ్ చేశాం. రెండు మూడు రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడమంటేనే కష్టం. అలాంటిది 25 రోజుల పాటు నాన్ స్టాప్ గా భారీ యుద్ధ సన్నివేశాలు చేశాం. నా కెరీర్ ఆరంభంలోనే ఇంత కష్టపడటం నాకు చాలా మేలు చేస్తుంది. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను'' అని వరుణ్ చెప్పాడు.