Begin typing your search above and press return to search.

శ్రీజ పెళ్లి కూతురైంది

By:  Tupaki Desk   |   24 March 2016 7:53 AM GMT
శ్రీజ పెళ్లి కూతురైంది
X
మెగాస్టార్ ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహం కోసం మెగా లెవెల్లోనే ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుక‌- రిసెప్ష‌న్ క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో జ‌ర‌ప‌బోతున్నారు. హైద‌రాబాద్‌ - బెంగుళూరుల్లోని చిరంజీవి నివాసాలు కొత్త శోభ‌ని సంత‌రించుకున్నాయి. కూతురు పెళ్లిని దృష్టిలో ఉంచుకొని రెండు చోట్లా త‌న ఇళ్ల‌ని ఈమ‌ధ్యే రెనొవేష‌న్ చేయించాడు చిరు. ఇప్పుడు ఆ ఇళ్ల‌కి పెళ్లి హంగులు కూడా జోడ‌వ‌డంతో మరింత క‌ళ సంత‌రించుకున్నాయి. వివాహం బెంగుళూరులోని ఇంట్లో 28న జ‌ర‌గ‌బోతోంది. అక్క‌డికి ప‌రిమిత సంఖ్య‌లోనే బంధుమిత్రుల్ని ఆహ్వానించార‌ట‌. 31న హైద‌రాబాద్‌ లోని ఓ హోట‌ల్‌ లో రిసెప్ష‌న్‌ ని ఏర్పాటు చేశారు. అక్కడికి మాత్రం సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఆహ్వానించారు.

శ్రీజ ఇప్ప‌టికే పెళ్లి కూతురైంది. పెళ్లి కళ ఉట్టిప‌డుతున్న ఆమెతో క‌లిసి త‌మ్ముడు వ‌రుణ్‌ తేజ్ ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశాడు. శ్రీజ నిజంగానే కుంద‌న‌పు బొమ్మ‌లా ఉంది. మా ఇంట్లో సెల‌బ్రేష‌న్స్ షురూ అయ్యాయంటే వ‌రుణ్‌ తేజ్ ట్వీటాడు. వారం రోజులపాటు జ‌రిగే ఈ సంబ‌రాల్లో చిరంజీవి కుటుంబం మొత్తం పాల్గొంటుంది. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ కూడా త‌న సినిమా ప‌నుల్ని ప‌క్క‌న‌పెట్టి మ‌రీ ఈ వేడుకల్లో పాలు పంచుకొంటాడ‌ట‌. ఇటీవ‌లే చిరు - ప‌వ‌న్‌ లు క‌లిసి ఆడియో వేడుక‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య ఎంత స‌ఖ్య‌త ఉందో ఆ వేడుక‌తో నిరూపించారు. ఇప్పుడొచ్చిన ఫ్యామిలీ ఫంక్ష‌న్‌ తో మ‌ళ్లీ మెగా హీరోలంతా క‌లిసి ఒక‌చోట సంద‌డి చేయ‌బోతున్నార‌న్న‌మాట‌.