Begin typing your search above and press return to search.

యాస మార్చిన మెగా హీరో

By:  Tupaki Desk   |   9 July 2018 5:44 AM GMT
యాస మార్చిన మెగా హీరో
X
తెలుగు రాష్ట్రాల్లో యాస పరంగా ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ సినిమాకు వచ్చేటప్పటికి మాత్రం ఒకే రకమైన బాష రాజ్యమేలుతు వచ్చింది. భక్త ప్రహ్లాద మొదలుకుని మొన్న వచ్చిన తేజ్ ఐ లవ్ యు దాకా ఇదే వాడుకలో ఉంది. విభజన జరిగిన తర్వాత అనూహ్య మార్పు అనలేం కానీ చెప్పుకోదగ్గ విశేషం అయితే సినిమా భాషలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే తెలంగాణ యాస. ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లు లేదా విలన్ల మధ్య సంభాషణల కోసం మాత్రమే పాక్షికంగా వాడిన దర్శక రచయితలు ఇప్పుడు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెడుతున్నారు. పెళ్లి చూపులు సినిమాలో మొత్తం మెజారిటీ భాగం హైదరాబాద్ స్లాంగ్ లో తీయగా తరుణ్ భాస్కర్ రెండో సినిమా ఈ నగరానికి ఏమైందిలో ఆ డోస్ ఇంకా పెంచాడు. ఇక ఫిదాలో దిమాక్ బద్మాష్ అంటూ సాయి పల్లవి చేసిన అల్లరికి థియేటర్లు పోటెత్తాయి. హీరో వరుణ్ తేజ్ అయినప్పటికీ అందరిని వలల పడేలా చేసింది మాత్రం భానుమతి పాత్రే. మొన్న వచ్చిన పంతం సినిమాలో మెహ్రీన్ పక్కన స్నేహితురాలిగా చేసిన కౌముదితో ప్రత్యేకంగా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ రాసుకున్నారు. దీని ప్రాధాన్యత అంతగా పెరుగుతోంది మరి.

ఇప్పుడు వరుణ్ కూడా ఇదే బాటలో పడుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో వరుణ్ పక్కా హైదరాబాదీ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తాడట. సో స్లాంగ్ కూడా దానికి అనుగుణంగా మార్చి ప్రత్యేకంగా రాసుకున్నాడట అనిల్ రావిపూడి. ఇది చాలా కొత్తగా ఉంటుందని మెగా హీరోలు ఇప్పటి దాకా పూర్తి స్థాయి తెలంగాణ స్లాంగ్ ఏ సినిమాలోనూ వాడలేదు కాబట్టి ట్రాక్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఆ మధ్య నాని కూడా కృష్ణార్జున యుద్ధంలో చిత్తూర్ స్లాంగ్ ని వాడుకోగా అరవింద సమేత వీర రాఘవ కూడా అదే ట్రాక్ లో ఉంటుందని వినికిడి. మొత్తానికి మన హీరోలు కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు. సాంప్రదాయ తెలుగు సినిమా బాషకు కొత్త నడకలు నేర్పిస్తూ వినూత్నత్వం వైపు మళ్లుతున్నారు. ఇది ఒకరకంగా మంచిదే. సినిమాలు ఎక్కువగా చూసే నేటి యువతరానికి తెలుగు భాషలో ఎన్ని యాసలు ఉన్నాయో అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది .