Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్.. ఇంకోటి ఓకే చేశాడు

By:  Tupaki Desk   |   6 March 2018 8:04 AM GMT
వరుణ్ తేజ్.. ఇంకోటి ఓకే చేశాడు
X
‘లోఫర్’.. ‘మిస్టర్’ లాంటి డిజాస్టర్లతో ఏడాది కిందట వరుణ్ తేజ్ కెరీర్ చాలా ప్రమాదకర స్థితిలో కనిపించింది. మున్ముందు ఇతడి పరిస్థితి ఏమవుతుందో అని కంగారు పడ్డారు మెగా అభిమానులు. కానీ ‘ఫిదా’తో గాడిన పడ్డ వరుణ్.. ఈ ఏడాది ‘తొలి ప్రేమ’తో మరో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుని తన ఇమేజ్.. మార్కెట్ పెంచుకున్నాడు. ఈ ఊపులో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సాహసిస్తున్నాడు. ఇప్పటికే ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస్ ఫిలిం చేయడానికి వరుణ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అతను విదేశాల్లో ప్రత్యేక పరిస్థితుల మధ్య శిక్షణ కూడా తీసుకోబోతున్నాడు. ఏప్రిల్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.

దీంతో పాటు వరుణ్ మరో సినిమాకు కూడా అంగీకారం తెలపడం విశేషం. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకున్న సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ నటించబోతుండటం విశేషం. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ తర్వాత ఏడాదికి పైగా ఖాళీగా ఉండిపోయిన సాగర్.. ఇటీవలే ఒక విభిన్నమైన కథతో వరుణ్ ను కలవడం.. అతను ఓకే చెప్పడం జరిగింది. 14 రీల్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడం విశేషం. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదికి వెళ్తుందట. వరుణ్ ముందు ఇంకా రెండు మూడు ప్రపోజల్స్ ఉండటం విశేషం.