Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'వీర భోగ వసంత రాయలు'

By:  Tupaki Desk   |   26 Oct 2018 1:00 PM GMT
మూవీ రివ్యూ : వీర భోగ వసంత రాయలు
X
చిత్రం : 'వీర భోగ వసంత రాయలు'

నటీనటులు: నారా రోహిత్ - సుధీర్ బాబు - శ్రీ విష్ణు - శ్రియ సరన్ - రవి ప్రకాష్ - శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: మార్క్ రాబిన్
ఛాయాగ్రహణం: వెంకట్
నిర్మాత: అప్పారావు బెల్లాన
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: ఇంద్రసేన

కొత్తగా అనిపించే టైటిల్.. ఆసక్తికర కాంబినేషన్.. వైవిధ్యమైన ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించిన మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. కొత్త దర్శకుడు ఇంద్రసేన రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

క్రికెటర్లు.. సెలబ్రెటీలు 300 మంది ఉన్న ఒక విమానం హైజాక్ అవుతుంది. మరోవైపు అదే సమయంలో కొందరు చిన్నారులు కిడ్నాప్ అవుతారు. ఇంకోవైపు ఓ పిల్లాడు తమ ఇల్లు కనిపించకుండా పోయిందంటూ పోలీసుల్ని ఆశ్రయిస్తాడు. ఈ మూడు కేసులూ పోలీసులకు సవాలు విసురుతాయి. మరి ఈ అనూహ్య పరిణామాల వెనుక కారణాలేంటి.. ఈ చిక్కుముడుల్ని పోలీసులు ఎలా ఛేదించారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

థ్రిల్లర్ సినిమాలంటే ప్రేక్షకుల మెదళ్లకు పరీక్ష పెట్టాలి. తర్వాత ఏం జరుగుతుందా అని ఉత్కంఠ రేకెత్తించాలి. కథనంతో పరుగులు పెట్టించాలి. ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలో మిగతా రెండు లక్షణాల సంగతలా వదిలేస్తే.. మొదటి లక్షణం మాత్రం కావాల్సినంత ఉంది. మొదలైనప్పట్నుంచి చివరి దాకా ఈ చిత్రం ప్రేక్షకుల మెదళ్లకు పరీక్ష పెడుతూనే ఉంటుంది. అసలేంటీ కథ.. ఏంటీ పాత్రలు.. ఏంటీ స్క్రీన్ ప్లే.. ఏంటీ సన్నివేశాలు అని.. ఆద్యంతం ప్రేక్షకులు ప్రశ్నించుకుంటూ పరీక్షకు గురవుతూనే ఉంటారు. రెండు గంటల 5 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులు ఏ దశలోనూ ఎంగేజ్ కాని విధంగా.. ఒక్క సన్నివేశమైనా బాగుందే అన్న ఫీలింగ్ ఏ కోశానా రాకుండా ఎలా జాగ్రత్త పడ్డారన్నది అర్థం కాని విషయం. కొత్తదనం పేరుతో నూతన దర్శకుడు ఇంద్రసేన చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం ‘వీర భోగ వసంత రాయలు’ అనడానికి ఏమాత్రం మొహమాట పడాల్సిన పనే లేదు.

వేర్వేరు కథల్ని సమాంతరంగా చూపిస్తూ.. చివరగా వాటికి ముడిపెట్టి.. ఒక కంక్లూజన్‌ కు తీసుకొచ్చే థ్రిల్లర్ కథలు గతంలో చాలానే చూశాం. హాలీవుడ్లో తరచుగా వచ్చే ఈ తరహా ప్రయత్నాల్ని మనవాళ్లు అనుకరించే ప్రయత్నం చేశారు. ఐతే ఏ తరహా కథ చెప్పినా.. ఒక పర్పస్ అనేది ఉండాలి. ఏ కథ చెబుతున్నామో.. ఎలా చెబుతున్నామో దర్శకుడికైనా కొంచెం అవగాహన ఉండాలి. ఐతే సినిమా తీస్తుండగా.. రషెస్ చూసుకున్నపుడు దర్శకుడితో పాటు చిత్ర బృందంలోని వారికి ఈ సినిమా ఏం అర్థమైందన్నదే సందేహం. అసలు ముప్పావు భాగం సినిమా అయ్యే వరకు కథేంటన్నది అర్థం కాదు. అసలేం చెప్పదలుచుకుంటున్నారన్నది అవగాహన ఉండదు. పోనీ ప్రేక్షకుల్ని సస్పెన్సులో పెట్టి.. ఏవైనా ఆసక్తికర సన్నివేశాలతో ఎంగేజ్ చేశారా అంటే అదీ లేదు. ఏ సన్నివేశం ఎందుకొస్తుందో తెలియదు.. దేని ఉద్దేశమేంటో అర్థం కాదు.. సన్నివేశాలు వస్తుంటాయ్ పోతుంటాయి. ఏది పడితే అది తీసి.. ఎలా పడితే అలా పేర్చేసినట్లుగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపూ. చివరి 15-20 నిమిషాల్ని మినహాయిస్తే సినిమా మొత్తంలో ఎంగేజ్ చేసే ఎపిసోడ్ అన్నదే లేదు.

మొదలైన కొన్ని నిమిషాల నుంచి తలా తోకా లేకుండా సాగుతూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది ‘వీర భోగ వసంత రాయలు’. సినిమాలో ఒకటికి మూడు ఉప కథలున్నాయి కానీ.. ఏదీ ఒక తీరుగా నడవదు. ప్రేక్షకుల్ని హింసించడంలో ప్రతి కథా ఇంకో కథతో పోటీ పడుతుంది. ముఖ్యంగా తన ఇల్లు పోయిందంటూ ఒక పిల్లాడొచ్చి పోలీసులతో పాటు ప్రేక్షకుల్ని ఆడుకునే కథ స్టాండ్ ఔట్‌ గా నిలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇందులోని ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ కూడా ఒక రేంజిలో తీస్తున్న ఈ రోజుల్లో ఇందులోని కొన్ని సీన్లు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. విమానం హైజాక్ నేపథ్యంలో నడిచే సీన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. యూట్యూబ్ లో దొరికే ఏవేవో పాత విజువల్స్ తీసుకుని అతికించి.. అటు తిప్పి ఇటు తిప్పి విమానం గాల్లోకి ఎగురుతున్న సీన్ చూపించి.. హైజాక్ ఎపిసోడ్ ను రక్తి కట్టించడానికి ప్రయత్నించిన వైనం అమోఘం. కనీసం ఇందులో ప్రధాన పాత్రధారి ధరించే మాస్కు కూడా సరిగా తయారు చేయించుకోలేని దుస్థితి గురించి ఏం మాట్లాడతాం? ఇలాంటి విడ్డూరాలు సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఈ సినిమా ఏ ఉద్దేశంతో తీశారు.. ఏం చెప్పాలనుకున్నారన్నది ఒక మిస్టరీ. ఈ ఏడాది ఇంటిలిజెంట్.. ఆఫీసర్ లాంటి డిజాస్టర్లకే డిజాస్టర్లను చూశాం. ఐతే వాటిలో కథాకథనాలు ఎంత చెత్తగా ఉణ్నా.. వాటి దర్శకులు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. కానీ ‘వీర భోగ వసంత రాయలు’ దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతడికైనా అవగాహన ఉందా అన్నది సందేహమే.

నటీనటులు:

ఇలాంటి సినిమాలో నటీనటుల గురించి ఏం మాట్లాడతాం. అసలు వాళ్లకు ఈ కథ గురించి దర్శకుడు ఏం చెప్పాడో.. వాళ్లకేం అర్థమైందో? బహుశా తమ ఆలోచనలకు అందని అద్భుతమైన సినిమా ఇది అని నటీనటులు భావిస్తే తప్ప ఇందులో నటించే సాహసం చేసి ఉండరు. నారా రోహిత్ లాంటి మంచి నటుడికి ఇందులో పూర్తిగా సంకెళ్లు వేసేశారు. సుధీర్ బాబు ఎంత అన్యమనస్కంగా చేశాడో చాలా సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక శ్రీవిష్ణు అవతారం చూసి ఏదో అనుకుంటాం కానీ.. అతడి పాత్ర అర్థరహితంగా సాగుతుంది. అతడి పాత్రకు రాసిన డైలాగులు.. వాటిని పలికిన విధానం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శ్రియ సరన్ గెటప్ లో ఉన్న విశేషం.. పాత్రలో లేదు. రవిప్రకాష్.. శ్రీనివాస రెడ్డి.. వీళ్లంతా కూడా ఏమీ చేసింది లేదు.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్లు కూడా సినిమాకు తగ్గ ఔట్ పుటే ఇచ్చారు. మార్క రాబిన్ నేపథ్య సంగీతం ఏమంత ఆకట్టుకోదు. వెంకట్ ఛాయాగ్రహణం అంతంతమాత్రమే. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఈ సినిమా ఒక పాఠం నేర్పిస్తుంది. సినిమా ఎలా తీయకూడదో ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకోవచ్చు. ఇక దర్శకుడు ఇంద్రసేన గురించి ఏం చెప్పాలి? ఇతడిని సుధీర్ బాబు ఇంతకుముందు ఏకంగా క్రిస్టఫర్ నోలన్ తో పోల్చాడు. నోలన్ సినిమాల్లో సామాన్య ప్రేక్షకులకు అర్థం కానంత ఇంటలిజెన్స్ ఉంటుంది. బహుశా ‘వీర భోగ వసంత రాయలు’ స్క్రిప్టు తనకు అర్థం కాక సుధీర్ ఆ మాట అన్నాడో ఏమో తెలియదు మరి. ఇంద్రసేనకు ఏవో కొన్ని వైవిధ్యమైన ఆలోచనలున్నాయి కానీ.. వాటిని తెరమీదికి తెచ్చే క్రమంలో పూర్తిగా దారి తప్పాడు. తలాతోకా లేకుండా సినిమాను నడిపించాడు.

చివరగా: వీరభోగ వసంత రాయలు.. అయోయయం.. అస్తవ్యస్తం

రేటింగ్-0.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre