Begin typing your search above and press return to search.

టాలీవుడ్లో ఏంటీ కొత్త గొడవ?

By:  Tupaki Desk   |   11 May 2016 5:49 AM GMT
టాలీవుడ్లో ఏంటీ కొత్త గొడవ?
X
తెలుగు సినీ పరిశ్రమకు కొత్త తలనొప్పి మొదలైంది. సినిమా షూటింగుల కోసం ఉపయోగించే వాహనాల అద్దె పెంచాలంటూ వాటి యజమానులు డిమాండ్ చేస్తూ పెద్ద గొడవే చేస్తున్నారు. ఐతే ఈ డిమాండ్ మీద చర్చలు నడుస్తుండగానే వాహన యాజమాన్య వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు షూటింగులకు అడ్డం పడుతూ.. నానా యాగీ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వాహన యజమానులు ఎక్కువ అద్దె డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. కొందరు నిర్మాతలు బయటి వాహనాలు తెచ్చుకోగా.. వాటి మీదికి దాడికి దిగుతున్నారు. ఈ మధ్య ఓ పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్న చోట వాహనాల టైర్లు కోసి.. అద్దాలు పగలగొట్టి షూటింగుని అడ్డుకోవాలని చూడటం వివాదాస్పదమైంది. దీంతో నిర్మాతల మండలి రంగంలోకి దిగింది. ఈ గొడవ మీద ప్రెస్ మీట్ పెట్టింది. ఈ వాహన యజమానులు 24 క్రాఫ్ట్స్ పరిధిలోకి రారని.. కాబట్టి ఈ విషయంలో మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. వాహనాల అద్దె పెంచే విషయం నిర్మాత ఇష్టమని.. నిర్మాతలతోనే మాట్లాడుకోవాలని పేర్కొంది.

నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘వాహన యజమానులు ఇబ్బందులు కలిగిస్తుండటంతో నిర్మాతలు ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు. ఆ వాహనాల్ని అడ్డుకోవడం.. ధ్వంసం చేయడం సరికాదు. ఈ విషయమై కొందరు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమస్య తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దృష్టికి వెళ్లింది. వాహన యజమానులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 12న అందరం కలిసి మాట్లాడుకుందాం అనుకున్నారు.

ఇంతలోనే వాహన యజమానులు షూటింగుల్ని అడ్డుకోవడం.. గొడవ చేయడం సరికాదు. ఈ వాహన యజమానులు 24 క్రాఫ్ట్స్ పరిధిలోకి రారు. కాబట్టి వారికి చెల్లింపులు చేసే విషయంలో మేం జోక్యం చేసుకోం. అద్దె పెంచాలా లేదా అన్నది నిర్మాత ఇష్టం. కలిసి మాట్లాడుకోవాలి’’ అని స్పష్టం చేశారు. మరి ఈ గొడవ ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.